అగ్ర దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా అందించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఇప్పటికే పలు అవార్డులు కూడా అందుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ తో పాటుగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లోనూ తెలుగు సినిమా సత్తా చాటింది.
ఇటీవల యూఎస్ లో బేవెర్లీ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ఐదు విభాగాల్లో అవార్డ్స్ అందుకున్నారు. సినిమాలో ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇదే వేదికపై స్పాట్ లైట్ అవార్డ్ ను అందుకున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అందరూ మెగా వారసుడిని కొనియాడుతున్నారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుతో పాటుగా ఆనంద్ మహీంద్రా వంటి పారిశ్రామిక వేత్తలు సైతం రామ్ చరణ్ ను అభినందిస్తూ పోస్టులు పెట్టారు. కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా చెర్రీ పోస్టర్స్ తో కంగ్రాట్స్ తెలియజేశారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది కానీ.. వీరంతా ప్రత్యేకంగా చరణ్ ను మాత్రమే అభినందించి, ఆర్‌ఆర్‌ఆర్‌లో మరో ప్రధాన పాత్ర యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరుని విస్మరించడంపై ఫ్యాన్స్ విమర్శలు చేశారు.
హెచ్‌సీఏ స్పాట్ లైట్ అవార్డ్ లను ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ మొత్తానికి ప్రజెంట్ చేశారని.. కానీ కేవలం రామ్ చరణ్ కు మాత్రమే వచ్చినట్లుగా చిత్రీకరించారని తారక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఇదే విషయం మీద మెగా – నందమూరి ఫ్యాన్స్ మధ్య నెట్టింట ఓ రేంజ్ లో రచ్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్ సీఏ స్పాట్ లైట్ అవార్డ్ పై క్లారిటీ ఇచ్చింది.
ఓ నెటిజన్ ట్వీట్ కు స్పందిస్తూ, స్పాట్ లైట్ అవార్డ్ అనేది ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ కి వచ్చిందని, ప్రత్యేకంగా ఒక యాక్టర్ కి కాదని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. “జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియాలో ఒక సినిమా చేస్తున్నారు. అందుకే మేము ఆహ్వానం అందించినప్పటికీ ఆయన రాలేకపోయారు. మా దగ్గర అతని కోసం కూడా అవార్డు ఉంది. డోంట్ వర్రీ!” అని ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో స్పాట్ లైట్ అవార్డ్ చరణ్ తో పాటుగా తారక్ కు కూడా ఇస్తారనే స్పష్టత వచ్చింది.
నిజానికి హెచ్ సీఏ అవార్డ్స్ ఈవెంట్ కు ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ తో పాటుగా ఎన్టీఆర్ కూడా వెళ్లాల్సింది. కానీ ఆయన సోదరుడు తారకరత్న అకాల మరణంతో ఆగిపోయారు. దీంతో యూఎస్ వెళ్లిన చరణ్ అండ్ ట్రిపుల్ ఆర్ టీమ్ అవార్డ్స్ అందుకున్నారు. మార్చిలో ప్రతిష్టాత్మక ఆస్కార్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు, తారక్ కు హలీవుడ్ క్రిటిక్స్ స్పాట్ లైట్ అవార్డును ప్రధానం చేసే అవకాశం వుంది.