ఆల్మట్టి, బసవేశ్వర డ్యామ్ ల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ నుంచి దాదాపు లక్షా 5 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. అంతకంతకూ వరద నీరు వస్తుండడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 16 గేట్లతో 58 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు.
జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.65 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.60 టీఎంసీలకు చేరుకుంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద పోటెత్తుతోంది. దీంతో జులై నెలలో రికార్డ్ స్థాయిలో వరద వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ కు ప్రస్తుతం 2,52,967 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ఇప్పటికే 876 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 168.2670 టీఎంసీలుగా ఉంది.
మరోవైపు శ్రీశైలం జలాశయం గేట్లు తెరిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 21న ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్నారు. ఎగువ నుంచి వరద వస్తుండడంతో 21కి పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకుంటుందని అనుకుంటున్నారు అధికారులు.