ఇంత వయసొచ్చినా ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదని ఇంట్లో వాళ్ళు అడక్కపోయినా.. బయటివాళ్ళు అడిగితే చెప్పక తప్పదు. అసలు అడవి గాచిన వెన్నెలలా వయసంతా అయిపోతుంటే చూస్తున్నవాళ్ళు కూడా అదేమాట అనకుండా ఉండలేరు కూడా..ఇప్పుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విషయంలో ఇదే జరుగుతోంది. కౌమార వయస్సు, ప్రౌఢ వయస్సు కూడా దాటుతోంది. అయినా ఇంకా ఘోటక బ్రహ్మచారిలా ఆయన కనబడుతుంటే కమియా జానీ అనే యాంకరమ్మ ఉండబట్టలేక అడిగేసింది.
మీకిప్పుడు 52 ఏళ్ళ వయస్సని, ఇక పందిట్లో బాజాలు, పప్పన్నాలు ఎప్పుడని ఆమె అడిగింది. కర్లీ టెయిల్స్ అనే యూట్యూబ్ ఛానల్ కి చెందిన ఈమె.. చిట్ చాట్ చేస్తూ అడిగిన ఈ ప్రశ్నకు రాహుల్.. ఎవరైనా సరైన అమ్మాయి.. తనకు నచ్చిన పిల్ల దొరికితే తన పెళ్లికేమీ అభ్యంతరం లేదని చెప్పారు. దీనికేమైనా చెక్ లిస్ట్ ఉందా అని అడిగితే.. అలాంటిదేమీ లేదని, ప్రేమించే వ్యక్తి ఐడియల్ గా, ఇంటెలిజెంట్ గా ఉండాలని మనసులో మాట చెప్పారు.
తన భారత్ జోడో పాదయాత్రలో బిజీగా ఉంటున్నప్పటికీ, అది ముగింపు దశకు వస్తుండడంతో రాహుల్ కాస్త ఈ అమ్మడు అడిగిన ప్రశ్నలన్నిటికీ విసుక్కోకుండా సమాధానాలిచ్చారు. తన తల్లి సోనియా గాంధీ, గ్రాండ్ మదర్ ఇందిరా గాంధీ..ఇద్దరి గుణాలు కలగలసిన అమ్మాయితో జీవితంలో స్థిరపడేందుకు ఇష్టపడతానని ఆయన ఆ మధ్య మరో ఇంటర్వ్యూలో తన పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పారు.
ఇక ఈ తాజా చిట్ చాట్ లో ఆయన తనకిష్టమైన ఫుడ్, ఇష్టమైన డ్రెస్, తనకిష్టమైన పండ్లు, తన సోదరి ప్రియాంక గాంధీకి తనకు మధ్య చిన్న చిన్న గిల్లికజ్జాలు వంటివెన్నో చెప్పారు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటానని, ఏదిబడితే అది తిననని అన్నారు. ఢిల్లీలో తన ఫేవరేట్ రెస్టారెంట్లు మోతీ మహల్, సాగర్, శరవణ భవన్ అని తెలిపారు. లండన్ లో 24-25 ఏళ్ళ వయస్సులో జాబ్ చేస్తున్నప్పుడు తన కంపెనీ నెలకు సుమారు 2,500 పౌండ్ల నుంచి 3 వేల పౌండ్ల వేతనం చెల్లించేదన్నారు. ఇక తన గడ్డం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన.. సమయం వచ్చినప్పుడు తీసేస్తానన్నారు.