మహాభారతంలో పాండవులు తమ బంధువులను ఎలా ఎంపిక చేసుకోలేకపోయారో అలాగే ఇండియా కూడా భౌగోళికంగా తన పొరుగుదేశాలను ఎంపిక చేసుకోలేకపోయిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పారు. పొరుగునున్న పాకిస్తాన్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానిస్తూ.. ఆ దేశాన్ని కౌరవులతో, ఇండియాను పాండవులతో పోల్చారు. పాండవులు తమ దగ్గరి బంధువులను ఎంపిక చేసుకోలేకపోయారు. అలాగే పొరుగు దేశాలతోనూ ఇండియా బంధుత్వాన్ని కొనసాగించలేకపోతోంది. ఇందుకు దాని వైఖరే కారణం అన్నారు.
సహజంగానే మనఆశాభావం మనకుంటుంది అని వ్యాఖ్యానించారు. అణ్వస్త్రాలు కలిగిన పొరుగుదేశం (పాక్)పై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ కామెంట్ చేశారు. మనం బంధుత్వం కలుపుకుందామనుకున్నా పొరుగువాళ్ళు అందుకు విముఖత చూపుతుంటారు అని జైశంకర్ పేర్కొన్నారు.
‘ఇండియా.. ది వే.. స్ట్రాటిజీస్ ఫర్ ఎన్ అన్ సర్టైన్ వాల్డ్’ అన్న పేరిట ఇంగ్ల్లీషులో రాసిన తన పుస్తకావిష్కరణ సందర్భంగా పూణేలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు . దీన్ని మరాఠీలో ‘భారత్ మార్గ్’ పేరిట అనువదించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పాకిస్తాన్ లో దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితిపై తాను వ్యాఖ్యానించబోనని జైశంకర్ అన్నారు. వర్తమాన ఆర్ధిక సంవత్సరానికి ప్రపంచ బ్యాంక్ ఆ దేశ ఆర్ధిక వృద్ధిని 4 శాతం నుంచి 2 శాతానికి తగ్గించిందని, ఎకానమీకి సంబందించి ఆ దేశం క్లిష్ట పరిస్థితులనెదుర్కొంటోందని న్యూస్ ఇంటర్నేషనల్ పత్రిక పేర్కొంది.
శ్రీలంక ఇప్పటికీ సంక్షోభం లోనే కొట్టుమిట్టాడుతోంది అని కూడా ఈ పత్రిక వ్యాఖ్యానించింది. ఇక పాకిస్తాన్ తో కుదుర్చుకున్న ఇండస్ జల ఒప్పందం గురించి ప్రస్తావించిన జైశంకర్.. ఇది సాంకేతిక సమస్య అని, ఉభయదేశాల ఇండస్ కమిషనర్ల మధ్య జరిగే చర్చలపై భవిష్యత్ కార్యాచరణ ఆధారపడివుంటుందని అన్నారు. భారత విదేశాంగ విధాన ‘పలుకుబడి’ హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించిందని ఆయన తెలిపారు. అంటే మన విదేశాంగ విధాన పరిమితి మరింత విస్తృతమైందన్నారు.