భారత న్యాయవ్యవస్థలోనే అరుదైన సన్నివేశం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దేశ చరిత్రలోనే తొలిసారి భారత ప్రధాన న్యాయమూర్తిగా మహిళ నియమితులయ్యే సమయం వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వానికి కొలీజియం సిఫారసులు చేసింది. జాబితాలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సహా 9 మంది పేర్లు ఉన్నాయి. ఆ ముగ్గురిలో తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ నాగరత్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది పేర్లు ఉన్నాయి. అయితే కొలీజియం సూచించిన వారిలో జస్టిస్ నాగరత్న పేరును గనుక కేంద్రం ఆమోదించి, ఒకవేళ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆమె నియామకమైతే.. 2027లో ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే భారత తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర సృష్టిస్తారు. నాగరత్నం తండ్రి వెంకటరామయ్య కూడా 1989లో సమారు ఆరు నెలల పాటు సుప్రీంకోర్టు సీజేఐగా వ్యవహరించడం గమనార్హం.
ఇక, సుప్రీంకోర్టు జడ్జిలుగా కొలిజియం సిఫారుసులు చేసిన వారిలో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎంఎం సుందరేశ్, కర్ణాటక హైకోర్టు సీజే ఎస్ ఓకా, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు సీజే పీటీ రవికుమార్, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ నాగార్జున ఉన్నారు. అంతేకాదు, సుప్రీంకోర్టు జడ్జిగా సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ పేరు కూడా జాబితాలో ఉండటం విశేషం.
వాస్తవానికి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఒక్కసారయినా ఓ మహిళగా ఉండాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇంతవరకు అది జరగలేదు. గతంలో సీజేఐలుగా పనిచేసిన వారు కూడా మహిళలకు ఆ అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆ డిమాండ్ నెరవేరే అవకాశం కనిపిస్తోంది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ 9 మంది న్యాయమూర్తుల పేర్లతో కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. సుప్రీంకోర్టులో మొత్తం 10 జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2019, సెప్టెంబరు నుంచి జడ్జిల నియామకాలు జరగలేదు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఒక మహిళా జడ్జి మాత్రమే ఉన్నారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ 2022, సెప్టెంబరులో రిటైర్ కానున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది మహిళలు మాత్రమే న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు జడ్జిగా నియామకం కానుండటంతో.. తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్‌గా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.