
చినుకు చినుకు గాలివానగా మారినట్లు.. జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ కాల్ ఇప్పుడు.. చాలామందికి ఎసరు పెట్టబోతుంది. జస్టిస్ రామకృష్ణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్ తీసుకున్న తర్వాత హైకోర్టు.. ఇప్పుడు హైకోర్టునే కంటైన్ మెంట్ జోన్ గా మార్చాలని.. రిజిస్ట్రార్ జనరల్ మరణానికి చీఫ్ జస్టిస్ మహేశ్వరి కారణమంటూ వేసిన పిటిషన్ల వెనక కుట్రను చేధించాలంటూ ఓ విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్వీ రవీంద్రన్ ను విచారణాధికారిగా నియమించింది. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని కూడా ట్రైమ్ ఫ్రేమ్ పెట్టింది హైకోర్టు. దీనితో ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్యతోపాటు.. ఆయనతోపాటు ఉన్నవారు, ఆయన వెనక ఉన్నవారి గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయి.
జస్టిస్ రామకృష్ణపై దాడులు జరగడం.. వీటి వెనక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని ఆయన ఆరోపించడం.. ఆ తర్వాత జస్టిస్ ఈశ్వరయ్య ఈయనకు ఫోన్ చేసి సెటిల్ మెంట్ కు ప్రయత్నిస్తూ.. అనవసరపు కామెంట్లన్నీ చేయడంతో.. ఇప్పుడు ఇరుకున పడ్డారు. అవన్నీ హైకోర్టు ముందు పెట్టారు జస్టిస్ రామకృష్ణ. ఉద్దేశపూర్వకంగానే చీఫ్ జస్టిస్ పై కేసులు పెట్టించినట్లు స్వయంగా ఈశ్వరయ్యే ఫోన్ లో చెప్పడం.. ఆ ఫోన్ లో మాట్లాడింది తానేనని ఆయన ఒప్పుకోవడంతో హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనపడుతోంది.
ఇప్పుడు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి విచారణలో అసలు సంగతులన్నీ బయటికొస్తే.. బహుశా అది రాజకీయ సంచలనంగా మారే అవకాశం ఉంది. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. జస్టిస్ రామకృష్ణ ఆరోపించినట్లు.. మొద్దు శీను హత్య కేసు కూడా టాంపరింగ్ జరిగిందనేదానిపై కూడా విచారణకు ఆదేశిస్తే.. అది మరో సంచలనం అవుతుంది. ఇవన్నీ చివరకు.. తిరిగి తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటాయనే అంచనాలు వినపడుతున్నాయి.
అంతే కాదు.. న్యాయవ్యవస్ధపైనే జస్టిస్ ఈశ్వరయ్య కుట్ర చేశారనే ఆరోపణలు రుజువైతే.. ఆయనకు జగన్ మద్దతు ఉందనేది ఎస్టాబ్లిష్ అయితే.. జగన్ బెయిల్ కూడా రద్దయ్యే ఛాన్సుంది. అయితే దీనిపై ఎవరైనా పిటిషన్ వేస్తేనే.. ప్రస్తుతం బిజెపి మద్దతున్నందున.. సీబీఐ ఆ పనిచేయకపోవచ్చు. అలాగే మొద్దుశీను హత్య కేసులో నిజానిజాలు బయటికొచ్చినా.. ఆనాడు సహకరించిన అధికారులు.. వారి వెనకున్న నేతల పేర్లు బయటపడితే.. అది కూడా రాజకీయంగా వైసీపీకే నష్టం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మొత్తం మీద కులం, మతం, వ్యాపారాలను రాజకీయ నేతలు తమకనుకూలంగా వాడుకునే వెపన్లుగా మలుచుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు న్యాయవ్యవస్ధను కూడా ఒక వెపన్ గా వాడేస్తున్నారనే సంచలనాత్మక విషయాలను చూపిస్తున్నాయి.