అనుకున్నట్లుగా భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ బోబ్డే ఈ నెల 24న పదవీ విరమణ చేయనుండగగా… అదే రోజున జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు తీసుకోనున్నారు.
భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు బిడ్డ ఎన్వీ రమణ పదవిని అలంకరించనుండగా… ఈ అత్యున్నత పదవిని అధిరోహించనున్న రెండో తెలుగు వ్యక్తి కావటం గమనార్హం. జస్టిస్ ఎన్వీ రమణ 2022, ఆగస్టు 26వరకు పదవిలో ఉండనున్నారు.
న్యాయశాఖ సలహా మేరకు ప్రధాన న్యాయమూర్తిగా ఒకరి పేరు సూచించాలని అనవాయితీ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి బోబ్డే తన తర్వాత సీనియర్ అయిన జస్టిస్ ఎన్వీ రమణ పేరును సూచించారు. ఈ పేరును న్యాయశాఖ కేంద్ర హోంశాఖకు పంపగా… కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి ఈ నియామకాన్ని ఆమోదించి, తదుపరి సీజేఐగా అపాయింట్ చేశారు.