ప్రభుత్వం నుండి వరుసగా తన బెంచ్ ముందుకు వస్తున్న పిటిషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని వారాల్లో తను రిటైర్ అవుతున్న నేపథ్యంలో, తన ప్రతిష్టతో పాటు న్యాయమూర్తిగా హుందాతనంపై మచ్చరాకుండా ఉండేందుకు తను ప్రభుత్వంపై వచ్చే పిటిషన్లను వినబోనని తేల్చి చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం… ప్రభుత్వ భవనాలకు రంగులు వేయటం, వైసీపీ రంగులు వేసినందును వాటిని తొలగించేందుకు మళ్లీ రంగులు వేయటం వల్ల 4వేల కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని డాక్టర్ మద్దిపాటి శైలజ వేసిన కేసులో జస్టిస్ రాకేష్ కుమార్ ఎలాంటి ఆదేశాలివ్వలేనన్నారు. వృధాగా ఖర్చు చేసిన 4వేల కోట్లను మంత్రులు, సంబంధిత ప్రజా ప్రతినిధులు, అధికారుల నుండి వసూలు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు.
కానీ ఈ పిటిషన్ ను విచారించేందుకు సున్నితంగా తిరస్కరించిన ఆయన, జవవరి 2021లో తన రిటైర్మెంట్ తర్వాత వరకు కేసును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక పిటిషన్లలో జస్టిస్ రాకేష్ కుమార్ చేస్తున్న కామెంట్స్, ఇస్తున్న ఆదేశాలను సవాలు చేస్తూ సర్కార్ సప్లమెంటరీ పిటిషన్లు దాఖలు చేస్తుండగా, ఓ కేసులో ఏకంగా సుప్రీంకోర్టు తలుపుతట్టింది.