భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. సీజేఐగా ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. నవంబర్ 8 వరన ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈ పదవిలో ఆయన 74 రోజుల పాటు కొనసాగనున్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ. రమణ, ప్రధాని నరేంద్ర మోడీ,
కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
సీజేఐ జస్టిస్ లలిత్ నవంబర్ 9, 1957న జన్మించారు. జూన్ 1983లో అడ్వకేట్ గా ఎన్ రోల్ చేసుకున్నారు. ఆ తర్వాత బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1985 డిసెంబర్ వరకు ఆయన బాంబే హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 1986 జనవరిలో ఆయన సుప్రీం కోర్టు న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు.
2004 ఏప్రిల్ లో సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్ గా ఆయన పదొన్నతి పొందారు. 2జీ స్పెక్ర్టమ్ కేసులో సీబీఐ తరఫున విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆయన నియమితులయ్యారు. ట్రిపుల్ తలాఖ్, పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన కేసుల్లో ఆయన న్యాయమూర్తిగా పనిచేశారు.