తెలుగమ్మాయి, యువ అథ్లెట్ జ్యోతి యర్రాజీ అదరగొట్టింది. సైప్రస్ అంతర్జాతీయ మీట్‌లో 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 100 మీటర్ల హర్డిల్స్‌ను 13.23 సెకన్లలో పూర్తిచేసి ప్రథమ స్థానంలో నిలిచి.. స్వర్ణ పతకం సాధించింది.
సైప్రస్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ స్వర్ణ పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 13.23 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 13.38 సెకన్లతో అనురాధా బిస్వాల్(ఒడిశా) పేరిట 20 ఏళ్లుగా ఉన్న జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది.
అయితే, గతనెలలో కోజికోడ్‌లో జరిగిన ఫెడరేషన్ కప్‌లో జ్యోతి 13.09 సె టైమింగ్ నమోదు చేసింది. అయితే గాలివాటం ఎక్కువగా ఆ టైమింగ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. అలాగే, 2020 అఖిల భారత అంతర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతి 13.03 సెకన్లలో పరుగు పూర్తిచేసింది. కానీ, టోర్నీ సమయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమెను పరీక్షించకపోవడం.. భారత అథ్లెటిక్స్ సమాఖ్య తన ప్రతినిధిని పంపకపోవడంతో జాతీయ రికార్డుగా గుర్తింపు దక్కలేదు.
జ్యోతిది మధ్య తరగతి కుటుంబం. తండ్రి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. తల్లి గృహణి. హైదరాబాద్‌లోని హకీంపేట తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్‌లో ఓనమాలు నేర్చుకున్న జ్యోతి.. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఒడిశా అథ్లెటిక్స్ హై పర్ఫార్మెన్స్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటుంది. 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని ఈ సందర్భంగా యర్రాజి జ్యోతి తెలిపింది. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతానని చెప్పింది.