ఏపీ, తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి సిగ్గులేని కామెంట్స్ చేయడం ఏంటని మండిపడ్డారు. కేసీఆర్ ప్రధాని అవుతాడని విదేశీయులు కుట్రపడ్డారని, అందులో భాగంగానే క్లౌడ్ బరస్ట్ జరిగిందనీ కేసీఆర్ కామెంట్స్ చేశాడని ఎద్దేవా చేశారు. గతంలోనూ కరోనా సమయంలో పారాసిటమాల్ వేసుకోవాలని కేసీఆర్ చెప్పడం వల్ల లక్షల మంది చనిపోయారని ఆరోపించారు.
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి జగన్ ను తిట్టడం తప్ప ఇంకేమి తెలియదంటూ కేఏ పాల్ ఎద్దేవా చేశారు. పవన్ పదేళ్లలో 9 పార్టీలతో జతకట్టాడని..ఆయన రాజకీయాలకు పనికిరాడని ఆయన విమర్శించారు. ఈ పదేళ్లలో పవన్ 9 పార్టీలతో జతకలిశారన్న ఆయన.. పవన్ కల్యాణ్‌ను ఎవరు నమ్మటం లేదని వ్యాఖ్యానించారు.
మరోవైపు హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే గుజరాత్ లో పెట్టాలని బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని..తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం హైదరాబాద్ లోనే గ్లోబల్ సమ్మిట్ పెడతానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.
కాగా, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం హైదరాబాదులోనే గ్లోబల్ సబ్మిట్ పెడతానని పాల్ స్పష్టం చేశారు. తాను రాజకీయ నాయకుల బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని, 8 కోట్ల తెలుగు ప్రజల బాగుకోసం ఎంత దూరమైన వెళ్తానన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరు తెలుగు రాష్ట్రాలను అప్పుల కుప్పలో ముంచేశారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఐదు లక్షల కోట్లు, జగన్మోహన్ రెడ్డి ఎనిమిది కోట్ల లక్షల అప్పులు చేశారని మండిపడ్డారు. భారతదేశం త్వరలో వెనిజులా, శ్రీలంక కాబోతోందని హెచ్చరించారు.