ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో 50 శాతం కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్& కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ ఇంత తీవ్రమైన నిర్ణయం ఏ దేశంగానీ, ఏ రాష్ట్రం గానీ ఇప్పటివరకు తీసుకోలేదు. నిజంగా ఆర్థిక పరిస్థితి విషమంగా ఉంటే ప్రభుత్వం నుండి వేల కోట్ల రాయితీలు పొందుతున్న వ్యాపార వర్గాల రాయితీలు రద్దు చేయాలి. ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. విరాళాలకోసం పిలుపు నివ్వాలి. ఇంకా అవసరమైతే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో చర్చించి సమంజసమైన నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ వేతనంపై ఆధారపడి బ్రతికే ఉద్యోగుల వేతనాల్లో ఏక పక్షంగా 50 శాతం కోత విధిస్తే కుటుంబాల జీవన పరిస్థితి అస్తవ్యస్థమౌతుంది.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక, సహాయక చర్యల్లో పలు శాఖల ఉద్యోగులు అహర్నిశలు పని చేస్తూ ప్రభుత్వ ప్రతిష్ట పెంపుదలకు ప్రయత్నిస్తున్నారు. కేవలం 15 రోజుల లాక్ డౌన్ కే ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా తయారైందంటే నమ్మశక్యంగా లేదు. జీవన వ్యయ ప్రమాణాలకు అనుగుణంగా వేతన సవరణ జరగక, రెండు డిఎలు విడుదల కాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వ నిర్ణయం అశనీపాతం కలిగిస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు పనికి తగ్గ వేతనాలే ఇవ్వటంలేదు. వాళ్ళ వేతనాల్లో కూడా10 శాతం కోత పెట్టటం అన్యాయమని తెలిపింది.