గుంటూరు: జగన్ సర్కార్ కొలువులో మరో సాక్షి కుటుంబీకుడు చేరాడు. సీనియర్ జర్నలిస్ట్, సాక్షి విశ్రాంత ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పబ్లిక్ పాలసీ వ్యవహారాల్లో ప్రభుత్వ సలహాదారుగా ఈయన వ్యవహరిస్తారు. గతంలో ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి సంస్థలలో పనిచేసిన రామచంద్రమూర్తి తరువాత సాక్షి సంస్థలో చేరి చాలా కాలం అక్కడ ఎడిటోరియల్ డైరెక్టరుగా వుండి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. గతంలో వైఎస్‌కు, ఇప్పుడు జగన్‌కు రామచంద్రమూర్తి అత్యంత ఆప్తుడు. పబ్లిక్ పాలసీ సలహాదారు అనే పోస్టు ఇంతవరకు లేదు. రామచంద్రమూర్తి కోసం ఈ కొత్త సలహాదారు పోస్టును క్రియేట్ చేసినట్టుగా చెబుతున్నారు. క్యాబెనెట్ హోదాలో రామచంద్రమూర్తి ఈ పదవిలో కొనసాగుతారు. రామచంద్రమూర్తి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఖమ్మం ఈయన సొంత జిల్లా. ఇలావుంటే, సాక్షిలో మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవి ఇస్తారని మీడియా వర్గాలు చెప్పుకుంటున్నాయి. జగన్‌కు అత్యంత దగ్గరివాడైన మరో సాక్షి ఉన్నతోద్యోగి ప్రియదర్శిని రామ్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ మ్యాగజీన్ బాధ్యతలు అప్పగించవచ్చునని తెలుస్తోంది.