ప్రముఖ దర్శకులు, కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కళాతపస్వి మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
భారతీయ సినీపరిశ్రమలో టాలీవుడ్ పేరు వినబడేలా చేసిన దర్శకుల్లో కె విశ్వనాథ్ ఒకరు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకొని, అద్భుతమైన కావ్యాలను తెరకెక్కించి కళాతపస్వి అనిపించుకున్నారు. చెన్నైలోని ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టారు విశ్వనాథ్.
అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నప్పుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది.
సిరిసిరిమువ్వ సినిమాతో విశ్వనాథ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఈయన మొత్తం 60 సినిమాలకు దర్శకత్వం వహించారు. విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పున:స్థాపించాలనే ఉద్దేశాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు.
భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధామైనవి. అలాగే, సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ తీసిన చిత్రాల్లో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం ముఖ్యమైనవి. విశ్వనాథ్ దర్శకుడుగానే కాకుండా నటుడిగానూ అలరించారు. ఎల్వి ప్రసాద్, బీఎన్ రెడ్డి తరువాత దాదాసాహెబ్ ఫాల్కే పొందిన తెలుగు సినిమా దర్శకుడు ఈయనే.
విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ విద్య గుంటూరు హిందూ కాలేజీ, ఏసీ కాలేజీల్లో కొనసాగింది. బీఎస్సీ డిగ్రీ చేశారు. తల్లిదండ్రులు కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ. విశ్వనాథ్ కు ముగ్గురు పిల్లలు పద్మావతి దేవి, నాగేంద్రనాథ్, రవీంద్రనాథ్.