తెలంగాణ రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హడావుడి మామూలుగా లేదు. టీఆర్‌ఎస్ సర్కార్ ను గద్దె దించేది తామే.. కేసీఆర్ కు పోటీ తానే.. అన్నట్లుగా ఆయన వ్యూహాలు ఉంటున్నాయి. తనపై జరిగిన దాడి విషయంలో గానీ.. హౌస్ అరెస్టులపై ఇలా ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు పాల్.
అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన పాల్.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఎవరూ బలికాలేదు. అమరవీరుల కుటుంబాలను ప్రజాశాంతి పార్టీ తరఫున ఆదుకుంటాం. 1200 కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. ప్రజాశాంతి పార్టీ తరఫున శ్రీకాంతాచారి తండ్రిని ఎమ్మెల్యేగా నిలబెడతాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆయన మంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెడతారు’’ అని స్పష్టం చేశారు పాల్.
ఈ వ్యాఖ్యలు ఆలోచించేలా ఉన్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. స్వరాష్ట్రంలో 12 వందల మంది అమరులైతే.. కేసీఆర్ పాలనలో వారి కుటుంబాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ.. అన్ని విధాలుగా అండగా ఉంటూ.. ఉచిత విద్య, వైద్యం అందిస్తానని పాల్ చెబుతున్నారు.
ఇక పాల్ మరో వాదనను కూడా తెరపైకి తెచ్చారు. శ్రీకాంతాచారి అమరుడైన 2009 డిసెంబర్ 3నే సిసలైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమన్నారు. ఇప్పటినుంచి ఆ రోజునే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఈ ఏడాది డిసెంబర్ 3న శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రజాశాంతి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి మాట్లాడుతూ.. అమరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతులు జరపాలని కోరారు. రాష్ట్ర ప్రజల కోసం మరోసారి ఉద్యమం చేస్తామని.. ప్రజలకు న్యాయం జరిగినప్పుడే అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు వెంకటాచారి.