తెలంగాణలో ఇప్పుడు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పైనే చర్చ సాగుతోంది. అరక పట్టాల్సిన అన్నదాత.. ప్లకార్డులు పట్టి రోడ్డెక్కాడు. కేసీఆర్ సర్కార్ రైతుల్ని ఈ దుస్థితికి తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. శుక్రవారం కామారెడ్డికి వెళ్లి హడావుడి చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా కల్పిస్తోంది. అయితే.. ఈ ఇష్యూలోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఎంట్రీ ఇచ్చారు.
శనివారం మాస్టార్ ప్లాన్ విషయంపై కామారెడ్డి కలెక్టర్ ని కలిసి రైతులకు న్యాయం చేయాలని కోరారు పాల్. అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుల అనుమతి లేకుండా వారి భూములను లాక్కునే అధికారం ఎవరికీ లేదన్నారు. పది రోజుల్లో ఈ సమస్యను తాను పరిష్కరిస్తానన్నారు. దయచేసి రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. అన్నదాతల తరఫున తాను పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. సమస్య శాంతియుతంగా పరిష్కరించాలని కలెక్టర్ ని కొరానని చెప్పారు.
రైతులకు నష్టం కలిగించే కట్టడాలు, ఇండస్ట్రియల్ జోన్లను అడ్డుకుంటామని చెప్పారు పాల్. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రైతుల ఇష్టపూర్వకంగా తాను 1200 ఎకరాలు కొనుగోలు చేశానని.. అక్కడ కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించడం జరుగుతుందన్నారు. మంచి పంటలు పండించుకొని నాణ్యమైన ధరకు అమ్ముకోవాలని.. వీలైతే ప్రపంచ దేశాలకు పంటలను ఎగుమతి చేసుకోవాలని ఆయ న సూచించారు. మృతి చెందిన రాములు కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు పాల్.
మరోవైపు మూడో రోజు కూడా రైతులు ఆందోళనలు కొనసాగించారు. శుక్రవారం దాడికి నిరసనగా శనివారం కలెక్టరేట్ దగ్గర నిరసన చేపట్టారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా తనకు నష్టం జరుగుతుందన్న భయంతో సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి వివాదం ముదురుతోంది.