ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీలతో మోడీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని మరో శ్రీలంకలా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ 76 లక్షల కోట్ల అప్పు చేశారన్న ఆయన.. వచ్చే ఎన్నికలలో మార్పు కోసం ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. మోడీకి కూడా తాను లేఖలు రాశానని.. ఆరు నెలల్లో మన దేశం నాశనం కాబోతోందని జోస్యం చెప్పారు. రోగికి డాక్టర్ మెడిసిన్ ఇచ్చిన విధంగా.. దేశానికి మంచి మందు కావాలని అన్నారు.
దేశ ఆర్ధిక పరిస్థితిని గమనించి సరిదిద్దాలని చెప్పారు పాల్. దేశం, రాష్ట్రాలు ఆర్ధికంగా చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని.. నాయకులు ప్రభుత్వ సంపదను దోచి పెడుతున్నారని ఆరోపించారు. అదానీకి అన్యాయంగా ఆస్తులు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన బిల్లులోని అంశాలను అమలు చేయలేదని.. ఏపీ నాశనం కావడానికి నలుగురు ప్రధాన కారణమని వివరించారు.
మాజీ సీఎం చంద్రబాబు తాను చెప్పిన సలహాలను పట్టించుకోలేదని.. ఆయన ప్రధానమంత్రి కావడానికి, కుమారుడ్ని సీఎం చేయడానికి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ‘‘ఐదేళ్లలో రాజధాని కట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. మోడీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు. ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. బూత్ కమిటీ లు అయ్యే వరకు జిల్లాల్లో తిరుగుతా. ఏపీకి 8 లక్షల కోట్ల అప్పు.. రూపాయి పుట్టే పరిస్థితి లేదు. తెలంగాణలో 5 లక్షల కోట్ల అప్పు.. ఏం చేశారో తెలియదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ, కుల, కుట్ర రాజకీయాలకు చరమ గీతం పాడాలి. చంద్రబాబుకు వయసు మళ్లింది.. ఇప్పుడయినా నాకు మద్దతు ఇవ్వండి. నేను ఐదేళ్లల్లో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తా’’ అని అన్నారు పాల్. చంద్రబాబు, జగన్, తాను ఒకే వేదికపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. చంద్రబాబు కలలో కూడా గెలవరని.. ఏపీలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని మండిపడ్డారు.
ప్రధాని ప్రజలను మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. అనేక మంది జాతీయ నాయకులు తనను కలుస్తున్నారని.. కేసులతో వేధిస్తారని మోడీకి అందరూ భయపడుతున్నారని చెప్పారు. దేశంలో మార్పు రావాలంటే.. అందరూ తనకు మద్దతు ఇవ్వాలన్నారు. జగన్ తండ్రి, తల్లి తనకు ఎంతో గౌరవం ఇచ్చారన్నారు పాల్. కానీ.. ఆయన మాత్రం కలవటానికి ఆసక్తి చూపడం లేదని చెప్పారు. సీక్రెట్ గా అయినా ఆహ్వానిస్తే వెళ్లి కలుస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు జగన్ మేలు చేయాలని.. అప్పులు, ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని ఆయనకు ఇచ్చారని.. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి వచ్చారని వివరించారు. నవ రత్నాలు ఇవ్వడానికి డబ్బులు లేవని.. ఇంకో ఆరు నెలలు ఈ పథకాలకు డబ్బు ఎలా తెస్తారని ప్రశ్నించారు. అందుకే తనతో కలవాలని జగన్ కు ఆహ్వానం పంపారు. అలా కాకపోయినా తమ పార్టీలో చేరినా చూసుకుంటానని ఆఫర్ చేశారు పాల్.
ఇక పవన్ గురించి మాట్లాడుతూ.. పొత్తుల పార్టీలు మారుస్తూ వస్తున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లు తనకేం శత్రువులు కాదని అన్నారు. ‘‘ఈ అన్నయ్యతో కలువు… నీకు అంతా మంచి జరుగుతుంది. దశావతారాలు వద్దు.. నేనంటే పవన్ కు గౌరవం. తమ్ముడు ముందుకు వస్తే.. కలిసి పని చేస్తాం. కమ్యూనిస్టులు అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది’’ అంటూ తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు కేఏ పాల్.