ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప బాగుపడింది ఎవరూ లేరనేది ప్రతిపక్షాల వాదన. ఉద్యమ సమయంలో సైకిళ్లపై తిరిగిన ఫ్యామిలీ.. ఇప్పుడు వేల కోట్లు సంపాదించిందని తరచూ విమర్శలు చేస్తుంటాయి. అయితే.. ఈ విషయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఓ అడుగు ముందుకేశారు. ఏకంగా సీబీఐ డైరెక్టర్ నే కలిశారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల అవినీతిపై ఫిర్యాదు చేశారు.
ఢిల్లీలో సీబీఐ సుబోద్ కుమార్ జైశ్వాల్ ను కలిసి కంప్లయింట్ చేశారు కేఏ పాల్. దాదాపు రూ.9 లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్, ఆయన కుటుంబం పాల్పడిందనేది పాల్ ఆరోపణ. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి చూడలేదని.. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని కోరారు పాల్. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందని.. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, కవిత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణతో పాటు సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని అన్నారు పాల్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని.. అంచనా బడ్జెట్ రూ.1.05 వేల కోట్లు కాగా.. రూ.35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. మిగిలిన రూ.75 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అలాగే.. యాదాద్రి అభివృద్ధి పేరుతోనూ అవినీతి జరిగిందన్నారు. రూ.2 వేల కోట్ల అంచనాలో రూ.200 కోట్లు ఖర్చు చేసి అంతా దోచుకున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలన్నారు పాల్. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీలపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకు తనపై దాడులు చేస్తున్నారని చెప్పిన పాల్.. కల్వకుంట్ల కుటుంబం అక్రమాలపై జరిగే దర్యాప్తునకు తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. సీబీఐతోపాటు కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలాకు కూడా ఫిర్యాదు కాపీలను పంపారు పాల్.