మునుగోడు ఉప ఎన్నికల్లో అనూహ్యంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బరిలోకి దిగారు. చివరి నిమిషంలో ఆయన స్వయంగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. నిజానికి మునుగోడులో ప్రజా శాంతి పార్టీ తరఫున ప్రజా కవి గద్దర్ పోటీ చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం కేఏ పాల్ స్వయంగా తెలిపారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేఏ పాల్ ఆఫీసుకు వద్దకు వెళ్లిన గద్దర్.. కార్యాలయం లోపలికి వెళ్లకుండానే వెనుదిరిగారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు తలెత్తాయి.
ఈ అంశంపై కేఏ పాల్ స్పందించారు. ప్రజా శాంతి పార్టీ తరపున నామినేషన్ వేయడానికి గద్దర్ కు ఎలాంటి అసంతృప్తి లేదని వెల్లడించారు. అయితే గద్దర్ నామినేషన్ వేయకుండా పోలీసులు అడ్డుకున్నారన్నారు. దీంతో ప్రజా శాంతి పార్టీ తరఫున తానే నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు.
కాగా అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మునుగోడులో విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నాయని, కేవలం నామినేషన్ ప్రక్రియ కోసమే ప్రధాన పార్టీలు రూ.100 నుంచి 200 కోట్ల వరకు ఖర్చు చేశాయని కేఏ పాల్ ఈసీకి ఫిర్యాదు చేశారు. బై ఎలక్షన్స్ లో డబ్బు ఆశ చూపుతూ జనాన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఒక్కో ఓటుకు సగటున రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని, దీంతో ఎన్నిక సజావుగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఓటర్ల జాబితాలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని అందుకే ఈ ఉప ఎన్నికను వాయిదా వేయాలని కేఏ పాల్ ఎన్నికల కమిషన్ ను లిఖితపూర్వకంగా కోరారు.