టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆ పార్టీ నేతలు. దీనిపై ప్రజాశాంతి పార్టీ ఫౌండర్ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు పెట్టారని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. రూల్స్‌కు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరారు.
గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టొద్దని, ఒకవేళ ఫ్లెక్సీలు పెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వమే ఉత్తర్వులిచ్చిందన్నారు కేఏ పాల్. ఇప్పుడు రూల్స్‌కి విరుద్ధంగా ఫ్లెక్సీలు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కోసం సిటీ వ్యాప్తంగా ఫ్లెక్సీలను పెట్టారని ఆరోపించారు.
క్లాసిఫైడ్స్ తో ప్రచారం చేస్కోవడం తప్పు కాదని, కానీ రోడ్డు మధ్యలో ఫ్లెక్సీలు పెట్టడం తప్పని కేఏ పాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటి వల్ల ప్రజానీకం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కేఏ పాల్ హైకోర్టును కోరారు.
అయితే, గత కొద్దిరోజులుగా కేఏ పాల్ తెలంగాణలో దూకుడు పెంచేశారు. అధికార టీఆర్ఎస్‌పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 30 సీట్లు కూడా రావంటూ గట్టిగా చెబుతున్నారు. ఇటీవలే గవర్నర్ తమిళిసైని కూడా ఆయన కలిశారు. రేపో మాపో సీఎం కేసీఆర్ అరెస్ట్ కావడం తప్పదంటున్నారు.
టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సిటీలో ఎక్కడ చూసినా ఆ పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లే కనిపిస్తున్నాయి. ప్లీనరీ కోసం కొన్నిచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్‌కు అడ్డంగా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.