గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాట పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. చంద్రబాబు మాకు ఇదేమీ ఖర్మ..? అని ప్రశ్నించిన ఆయన… కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడే బాబుని హెచ్చరించాను. అయినా ఒక్క శాతం కూడా మారలేదు అని విరుచుకుపడ్డారు. అసలు డీజీపీకి బుద్ది ఉండొద్దా? ఆయన సభకు అనుమతులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.
పది వేల మందికి అనుమతి తీసుకుని నలభై యాభై వేల మందిని తరలించారని ఆరోపించారు. అసలు చట్ట విరుద్దమైన సభలకు ఎలా అనుమతి ఇస్తారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో అయితే చంద్రబాబుకి 15 ఏళ్ల శిక్ష పడేదన్నారు. ప్రజలకు ఇప్పటికైనా బుద్ది రావాలని కేఏ పాల్ అన్నారు.
చంద్రబాబు ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయం గురించి సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఇక మోడీకి, అమిత్ షాకి కూడా అప్పులు ఇప్పిచ్చానని చెప్పుకొచ్చారు.
గుంటూరులో తొక్కిసలాట జరిగితే తమ్ముడు పవన్ కల్యాణ్ ఏమయ్యాడు అంటూ ప్రశ్నించారు. ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నా స్పందించడా..? అని నిలదీశారు.సినిమాలేవో చేసుకోవాలి. పవన్ కు రాజకీయాలు ఎందుకు అనే తరహా వ్యాఖ్యలు చేశారు. అయితే నేను తప్ప ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరని పాల్ తెలిపారు.