కామారెడ్డి రైతులకు న్యాయం చేసిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారం, డాక్టర్ కేఏ పాల్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ తెలంగాణ హైకోర్టు ఎదుట కామారెడ్డి రైతులు ఫ్లెక్సీని ప్రదర్శించడం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ ప్రజాశాంతి అధ్యక్షుడు పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ పిల్ పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అనుమతి లేకుండా మాస్టర్ ప్లాన్ విషయంలో ముందుకు వెళ్లవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎదుట కామారెడ్డి రైతులు ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేఏ పాల్ కోర్టులో పోరాటం చేస్తున్నారు. పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపించారు. రైతుల అభ్యంతరాలను తీసుకోకుండానే మాస్టర్ ప్లాన్ పై జీవో ఇచ్చారని తన పిల్ లో కేఏ పాల్ పేర్కొన్నారు.
ఈ పిల్ పై విచారణ సందర్భంగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ప్రభుత్వం సోమవారం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తమ అనుమతి లేకుండా మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది.