ఏప్రిల్ 14న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. అదే రోజు సీఎం కేసీఆర్ బర్త్ డే కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. అయితే.. కేసీఆర్ బర్త్ డే నాడు సచివాలయం ప్రారంభించడం ఏంటని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. విపక్ష నేతల్లో కేఏ పాల్ ఓ అడుగు ముందుకేసి కోట్లు మెట్లెక్కారు.
కేసీఆర్ బర్త్ డే నాడు తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు పాల్. ఫిబ్రవరి 17న కాకుండా అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న కొత్త సెక్రటేరియట్ ప్రారంభించేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందున ఆయన జయంతి రోజునే దాన్ని ప్రారంభించడం సముచితమని తెలిపారు. ఈ కేసులో పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపిస్తానన్న కేఏ పాల్.. ప్రతివాదులుగా సీఎంవో, చీఫ్ సెక్రటరీలను చేర్చారు.
మొదట్నుంచి కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు పాల్. కేసీఆర్ బర్త్ డే నాడు ప్రారంభిస్తే.. సచివాలయానికి కేసీఆర్ భవన్ అని పెట్టుకోవచ్చుగా అంటూ సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ తనను తాను జాతిపిత అని చెప్పుకుంటూ తన పుట్టిన రోజున సెక్రటేరియట్ ను ప్రారంభించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి రోజునే సచివాలయాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాదు, రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉంటే కేసీఆర్ నూతన సచివాలయం నిర్మించారని దుయ్యబట్టారు పాల్. ఫిబ్రవరి 17నే సచివాలయం ప్రారంభిస్తే అంబేద్కర్ అనుచరులు సచివాలయ ముట్టడికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వం తీరు మారదని ఘాటుగా విమర్శించారు పాల్. ఈ క్రమంలోనే ఆయన పిల్ దాఖలు చేశారు.