ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆంధ్ర ప్రదేశ్ లోని తాజా రాజకీయ పరిణామాలపై రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరిరామజోగయ్య నిరాహార దీక్షపై స్పందించారు. హరిరామజోగయ్యా.. ఈ వయసులో నీకెందుకు ఈ ధర్నాలు, దీక్షలు? మీకు కావాల్సింది ఏమిటి? రిజర్వేషన్లా! రాజ్యాధికారమా? అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు. నాతో కలిసి రండి.. అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.
ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ.. తాను బాబుతో సహా అనేక మందిని సీఎంలుగా చేశానని పాల్ తనదైన రీతిలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు కారణంగానే ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలపై వైసీపీ ప్రభుత్వం నిషేధం విధించిందని దుయ్యబట్టారు. టీడీపీ కంటే వైసీపీ వందరెట్లు బెటర్ అని అన్నారు.
చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదని, ఎన్నారైల నల్ల డబ్బును.. తెల్ల డబ్బుగా మార్చేందుకే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడంటూ పరోక్షంగా గుంటూరు ఘటన గురించి ప్రస్తావించారు. చంద్రబాబుతో ఉన్నవాళ్లను తాను శపిస్తున్నానని, చంద్రబాబుతో ఉంటే వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని వ్యాఖ్యానించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలో ఏపీ నేతలే చేరడంపైనా కేఏ పాల్ తన అభిప్రాయాలను తెలిపారు. రావెల కిశోర్ బాబు, తోట చంద్రశేఖర్ అమ్ముడుపోయారని, కేసీఆర్ కు ఏపీలో అడుగుపెట్టే హక్కులేదని స్పష్టం చేశారు కేఏ పాల్.