మల్లారెడ్డిపై దాడి ఘటనపై అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కులం, మతం ముసుగులో ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని.. కులం, మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సబబు కాదన్నారు.
మల్లారెడ్డి, రాకేశ్ టికాయత్ పై జరిగిన దాడులను పాల్ ఖండించారు. దేశం చాలా ఇబ్బందుల్లో ఉందని.. నెంబర్ వన్ చేయాలనేదే తన తపన అని తెలిపారు. ప్రశ్నించే వారిని జైలులో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పాల్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని తేల్చి చెప్పారు. ఇటు కాంగ్రెస్ పార్టీ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహి పార్టీ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఆపార్టీ నుంచి బయటకు రావాలని కోరారు. కాంగ్రెస్ కి కూడా డిపాజిట్ దక్కదని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదు.. దేశ ద్రోహి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 480 సీట్లు ఉన్న దేశంలో కాంగ్రెస్ 48 సీట్లకు పడిపోయిందని విమర్శించారు. రేపో మాపో అది 20, 30కి చేరుతుందని జోస్యం చెప్పారు.
ఇప్పుడున్నవన్నీ అవినీతి పార్టీలే అని విమర్శించిన పాల్.. దేశం బాగు కోసమే తాను తాపత్రయపడుతున్నానని అన్నారు. మరోవైపు మీడియా తీరును కూడా పాల్ తప్పుపట్టారు. అనవసరమైన అంశాలకు, ప్రజలకు పనికిరాని వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారని వాపోయారు. దేశంలో, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయంటూ మీడియాకు హితబోధ చేశారు కేఏ పాల్.