– షాతో పాల్ భేటీపై సర్వత్రా చర్చ
– అపాయింట్ మెంట్ లేకుండానే ఎందుకు కలిశారు?
అమిత్ షా తెలంగాణ పర్యటనకు ముందు ఢిల్లీలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. అదే.. ఆయన కేఏ పాల్ ను కలవడం. అసలు.. వీళ్లిద్దరూ ఎందుకు కలిశారు? దేనికి కలిశారు? పాల్ వెనుక ఉంది కేసీఆరా? లేక.. బీజేపీనా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా తెలంగాణ రాజకీయాల్లో కేఏ పాల్ చేస్తున్న సందడి మామూలుగా లేదు. సడెన్ గా అమెరికా నుంచి ఎంట్రీ ఇచ్చి.. కేసీఆర్ పై దండయాత్ర మొదలు పెట్టారు. ఓ దశలో మంత్రి కేటీఆర్ తమ అపోజిషన్ ప్రజాశాంతి పార్టీ అని తేల్చేశారు. ఆ సమయంలో పాల్ ను రంగంలోకి దింపింది కేసీఆరే అనే చర్చ జరిగింది.
రెండు రోజులకో ప్రెస్ మీట్ తో టీఆర్ఎస్ సర్కార్ ను ఏకిపారేస్తున్నారు పాల్. ఈ క్రమంలోనే ఆయనపై దాడి జరగడం.. అది కేటీఆర్ పనేనని ప్రకటించడంతో సంచలనం అయింది. ఈ విషయాన్ని ఆయన బాగానే క్యాష్ చేసుకున్నారు. అదే సమయంలో లక్షల కోట్లు తెచ్చి తెలంగాణను అభివద్ధి చేస్తానని చెప్పడంతో.. కేసీఆర్ కంటే పాలే బెటర్ అనే చర్చ కూడా జరిగింది. అయితే.. సడెన్ గా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పాల్ కలవడం చాలా ఇంట్రస్టింగ్ గా మారింది. ఈ భేటీ తర్వాత మరో వాదన తెరపైకి వస్తోంది. పాల్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారం ఊపందుకుంది.
ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడిన పాల్.. తెలుగు రాష్ట్రాల గురించి కీలక విషయాలను షాకు వివరించినట్లు తెలిపారు. తాను అపాయింట్ మెంట్ లేకుండానే షాను కలిశానని అన్నారు. తనపై జరిగిన దాడి గురించి చెప్పినట్లు చెప్పారు. దానిపై తగిన చర్యలు తీసుకుంటామని షా హామీ ఇచ్చారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ పాలనతోనే అప్పులు పెరిగిపోయాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పని అయిపోయిందని.. ప్రతిపక్ష పార్టీ స్థానాన్ని తామే భర్తీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అయితే.. పాల్ చేసిన వ్యాఖ్యలు కాస్త జోక్ గా అనిపించినా.. షాతో భేటీ వెనుక అసలు రహస్యం ఏమై ఉంటుందని అనేక ప్రశ్నలు వేస్తున్నారు విశ్లేషకులు. తెలంగాణలో పాల్ ద్వారా టీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లు ఏమన్నా చీల్చే ప్రయత్నంలో బీజేపీ ఉందా? అనే సందేహం వ్యక్తపరుస్తున్నారు.