ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బంపరాఫర్ ప్రకటించారు. తనతో కలిసి పని చేస్తే మంత్రిని చేస్తానన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ ఏం సాధించారని ప్రశ్నించారు. విద్యావంతులు తమ పార్టీలో రావాలని ఆహ్వానం పలికారు పాల్. ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ భ్రష్టు పట్టిపోయాయని విమర్శించారు.
హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటివరకు ఎవరెవరో దోచుకునే వాళ్లకు అధికారం ఇచ్చారని.. ప్రజలకు సేవ చేసేందుకు ఒకసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిందన్న ఆయన.. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి, కుటుంబ పార్టీలేనని విరుచుకుపడ్డారు.
ఇక తన వెనుక బీజేపీ ఉందనే విమర్శలపై స్పందించిన పాల్.. అవన్నీ అర్థ రహితమని కొట్టిపారేశారు. కొంతమంది పనిలేని వాళ్లు కావాలనే చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోడానికి టీఆర్ఎస్ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టే వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని.. కాంగ్రెస్ కి బీజేపీ అంటే భయమన్నారు. దేశంలోని మిగిలిన అన్నీ పార్టీలు బీజేపీ అనుబంధంగానే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు 2012లోనే ఎంపీ సీటు, మంత్రి పదవి ఆఫర్ వచ్చినా తిరస్కరించానని తెలిపారు. అమిత్ షా స్వయంగా మంత్రి పదవి ఇస్తానని తనకు చెప్పినట్లు వివరించారు కేఏ పాల్.