– తెలంగాణ ఎన్నికల కదనరంగంలో పాల్
-100 సీట్లు పక్కా అంటున్న ప్రజాశాంతి బాస్
– ఫాంహౌజ్ నుంచి ప్రగతిభవన్ దాకా బెంబేల్
– కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ కేఏ పాల్ ఫ్యాన్స్
– అవినీతి మూటలు వర్సెస్ ప్రపంచ నిధులు
– పాల్ ను చూసి కేసీఆర్ భయపడుతున్నారా?
– కేటీఆర్ ఇలాకాలో దాడి జరగడమేంటి?
– కేసీఆర్ కంటే పాలే బెటర్ అని జనం భావిస్తున్నారా?
కేఏ పాల్..తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు.ఎన్నికలొస్తే చాలు ఆయన చేసే హడావుడి అలా ఉంటుంది మరి. ప్రధాన నాయకుల వార్తను ప్రతీ బులిటెన్ లో మీడియా చూపిస్తుందో లేదోగానీ..పాల్ ఎంట్రీ ఇస్తే న్యూస్ మస్ట్..హెడ్ లైన్ మస్ట్.కొన్ని మీడియా సంస్థలు ఆయన్ను కామెడీ హీరోగా చూపించినా సరే..పాల్ లెక్కలు వేరు.2019 ఎన్నికలనే చూడండి..తన వంతు పాత్ర పోషించారు.తర్వాత యూఎస్ ఫ్లైట్ ఎక్కేశారు.అయితే.. ప్రస్తుతం ఎన్నికలేం లేకపోయినా.. సమాచారం లేని పిడుగులా తెలంగాణలో వచ్చి పడ్డారు.అధికార టీఆర్ఎస్ కు ఢీ అంటే ఢీ అని సవాళ్లు విసురుతున్నారు. అంతేనా.. 100 సీట్లు పక్కా అని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. దీంతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని పాల్ వర్గం అంటోంది.
‘‘కేసీఆర్ పాలనలో అంతా అశాంతి..ప్రత్యామ్నాయం మా ప్రజాశాంతి’’ అంటూ పాల్ మామూలు హడావుడి చేయడం లేదు. కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని ప్రజా సమస్యలపై నిత్య ప్రెస్ మీట్లు, పలకరింపులు అంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య కేటీఆర్ ఇలాకాలో వర్షాలకు పంట దెబ్బతిన్న రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లాలనుకున్నారు పాల్. కానీ.. మార్గమధ్యంలోనే పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై దాడి జరిగింది.టీఆర్ఎస్ నాయకుడొకరు పాల్ చెంప చెళ్లుమనిపించాడు. వెంటనే పోలీసులు ఆయన్ను తిరిగి హైదరాబాద్ పంపించారు. ఈ ఇష్యూలో పాల్ కు వచ్చిన ప్రమోషన్ మామూలుగా లేదు.ఆయన్నుతెలివి తక్కువగా అంచనా వేసినవారంతా షాకయిన పరిస్థితి.
తనపై జరిగిన దాడి..డీజీపీని కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడం..హౌస్ అరెస్ట్ ఇలా ప్రతీ అంశాన్ని హైలెట్ చేసుకుంటూ వెళ్తున్నారు పాల్.దీంతో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారారు. రైతుల కోసం తనపై దాడి జరిగినా వెనకాడనంటూ సీన్ ను బాగా రక్తి కట్టించారు.ఇదే ఊపులో ప్రగతి భవన్ కోటలు బద్దలుకొడతానంటూ దూసుకుపోతున్నారు పాల్. ఆయన దూకుడు ఎలా ఉందంటే..కేసీఆర్ వర్సెస్ పాల్ అనేలా కనిపిస్తోంది. దీనికితోడు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పాల్ వ్యూహాల్లో ఉన్నారు. సీఎం కేసీఆర్ కు మాదిరిగానే తెల్ల కార్ల కాన్వాయ్ ను సిద్ధం చేసుకున్నారు.ఈ మధ్యే కోట్లు పెట్టి కార్లను కొనుగోలు చేశారు.
ప్రస్తుతం పాల్ లక్ష్యం ఒక్కటే. కేసీఆర్ ను గద్దె దించడం.దానికోసం కోట్లు గుమ్మరించడానికి తాను సిద్ధమని ప్రకటన కూడా ఇచ్చారు. వేల కోట్లతో తెలంగాణను బంగారం చేస్తానని అంటున్నారు.కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ కాలేదని..తాను చేసి చూపిస్తానని చెబుతున్నారు.అందుకే ఏకకాలంలో కోట్ల రూపాయల కార్లను కొనుగోలు చేసినట్లు అనిపిస్తోంది.పాల్ పై తెలంగాణ ప్రజల్లో చర్చ జరుగుతోందనేది రాజకీయ నాయకుల వాదన.అంతేకాదు కేసీఆర్ ప్రస్తుతం భయంలో ఉన్నారని అంటున్నారు.రేవంత్ దూకుడుతో రాష్ట్రంలో కాంగ్రెస్ లో కొత్త ఉత్తేజం లభించింది.రాహుల్ సభ తర్వాత అది రెట్టింపు అయింది.అటు బీజేపీ కూడా తగ్గేదే లేదంటోంది.ఈసారి ట్రిపుల్ ఫైట్ గట్టిగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ..సడెన్ గా పాల్ ఎంట్రీ ఇచ్చారు.నిజానికి పాల్ ను తేలిగ్గా తీసుకోవడానికి లేదంటున్నారు విశ్లేషకులు. అందుకే కేసీఆర్ ఆయన్నులక్ష్యంగా చేసుకున్నట్లుగా చెబుతున్నారు.లేకపోతే..ఆయనపై దాడి జరగడం ఏంటి..? హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి..? పైగా కేటీఆర్ తమకు పోటీ పాల్ అని చెప్పడం ఏంటి..?ఈ పరిణామాలన్నీచూస్తుంటే పాల్ ను చూసి కేసీఆర్ వణికిపోతున్నట్లుగా విశ్లేషణ చేస్తున్నారు.
ముచ్చటగా మూడోసారి అధికారం కోసం కేసీఆర్ వ్యూహాల్లో ఉన్నారు. కానీ.. పీకే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం..30, 40 స్థానాలకు మించి విషయం లేదని తేలిపోయింది.ఇలా సవాలక్ష టెన్షన్లలో ఉన్న కేసీఆర్ కు ఇప్పుడు పాల్ పెద్ద తలనొప్పిగా తయారయ్యారనే చర్చ జరుగుతోంది.ప్రజలు కూడా ఆయనపై దృష్టి పెట్టారని అంటున్నారు రాజకీయ పండితులు.