బీఆర్ఎస్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు చావంటే భయం లేదన్నారు. బౌన్సర్లను కూడా ఇటీవలే తొలగించానని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తనను చంపాలని చూశారని.. కానీ ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసన్నారు. రాజశేఖర్ రెడ్డి చేసిన తప్పే.. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు.
నన్ను చంపాలని చూస్తే ముందు కేసీఆర్, కేటీఆర్ నే చనిపోతారంటూ వ్యాఖ్యానించారు. అమెరికానే గడగడలాడించానని, సోనియా గాంధీ, అమెరికా కలిసి నన్ను ఆపలేకపోయారన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్తున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్తులు ప్రదీప్, కళ్యాణ్ లను శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేయడం తప్పన్నారు. ప్రదీప్ చట్ట ప్రకారం వెళ్తుంటే అతన్ని అడ్డుకుంటారా? దమ్ముంటే నన్ను అడ్డుకోవాలని ఛాలెంజ్ విసిరారు.
కేసీఆర్ నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 70 మాస్టర్ ప్లాన్ పై ఉమ్మడిగా న్యాయ పోరాటం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ అవినీతిని ఆపాలని హెచ్చరించారు.
కేసీఆర్ తన సోదరుడి హత్య కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్, అమిత్ షాను కలవబోతున్నానన్నారు. బీజేపీతో మాకు ఎలాంటి ఒప్పందం లేదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర పెద్దలతో సమావేశమవుతానన్నారు కేఏ పాల్.