తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే వారిని అరెస్టులు చేయడం, వారి నోళ్లను మూయించడం ప్రభుత్వానికి కొత్త కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. గురువారం ఆయన ఢిల్లీలోని మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారని, ఆయన ఎఫ్ఐఆర్ కాపీ చదివితే టాలీవుడ్ సినిమాలా ఉందని సెటైర్లు వేశారు.
తీన్మార్ మల్లన్న ఎవరో తనకు తెలియదని, కేవలం రెండు సార్లు మాత్రమే కలిసినట్లు గుర్తు చేశారు. తీన్మార్ మల్లన్న టీమ్ పోలీసులను చితకబాది.. చంపడానికి ప్రయత్నం చేశారని, ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం సినిమాను తలపించేలా ఉందన్నారు. తనపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమంగా కేసులు పెట్టించారని, చంపాలని కూడా చూశారని ఆరోపణలు చేశారు.
నా ప్రాణాలైనా వదలడానికి సిద్ధం కానీ.. అభివృద్ధి కోసం, సమస్యలపై నిరంతరం పోరాడుతానని చెప్పారు. దేశంలో నిరుద్యోగులు, రైతులు, మహిళలకు న్యాయం చేయని ప్రభుత్వాలు మనకెందుకు? అని ప్రశ్నించారు. ఇక మంత్రి కేటీఆర్, బండి సంజయ్ ల పంచాంగాల ట్వీట్లతో ఎవరి డప్పు వాళ్లు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని ప్రజలు మోసపోయారని, కొన్ని కుటుంబాలు మాత్రమే బాగున్నాయని మండిపడ్డారు. అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చేయడానికి సిద్ధమని, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ప ప్రవీణ్ తనతో కలిసి పని చేయాలని సూచించారు. ప్రజాశాంతి పార్టీలో చేరాలని, ఇదే మన చివరి ఎలక్షన్ అని పిలుపునిచ్చారు కేఏ పాల్.