మహారాష్ట్ర రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. శివసేన నేతలు, తిరుగుబాటు నేతలు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు. తాజాగా తిరుగుబాటు నేతలను ఉద్దేశిస్తూ శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీంతో అంతా శివసేన స్ట్రాటజీపైనే చర్చిస్తున్నారు.
ఇంకా ఎంత కాలం బీజేపీ పాలిత అసోంలో దాక్కుంటారు అని రెబెల్ నేతలను ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు చౌపత్తి(ముంబై)కి రావాల్సి వస్తుంది అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్ లో మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జీర్వాల్ ఫోటోను అప్ లోడ్ చేశారు.
దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్ ను శివసేన కోరగా ఆ మేరకు రెబెల్స్ ఆయన నోటీసులు పంపారు. నోటీసులకు సోమవారం లోగా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని రెబెల్స్ కు డిప్యూటీ స్పీకర్ సూచించారు.
దీంతో ఆ పదహారు మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రెబెల్స్ వర్గం నాయకుడిగా ఉన్న ఏక్ నాథ్ షిండే పై మొదటి వేటు పడుతుందని, తద్వారా రెబల్స్ వర్గాన్ని గందరగోళంలో పడేసి, మిగిలిన వారిని తమ దారికి తెచ్చుకోవాలన్నది శివసేన వ్యూహంగా కనిపిస్తున్నట్టు రాజకీయ పండితులు చెబుతున్నారు.