విషాదాన్ని కూడా క్యాష్ చేసుకోవడం కార్పొరేట్ కంపెనీలకు చెల్లింది. తాలిబాన్ల నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం కొందరు విమానాల చక్రాలు పట్టుకుని.. ప్రాణాలు కోల్పోయిన తీరును చూసి ప్రపంచమంతా కన్నీళ్లు పెట్టింది. వారిని కాపాడలేని తమ నిస్సహాయతను తిట్టుకుంది. కానీ కొన్ని కంపెనీలకు ఈ విషాదం కూడా వినోదంగా అనిపించింది. వ్యాపారం చేసుకోవచ్చని నీచబుద్ధి పుట్టింది.
విమానం నుంచి ఆప్ఘాన్ పౌరులు జారిపడిపోయిన చిత్రాలతో కూడిన టీ షర్ట్‌లను కొన్ని కంపెనీలు ఆన్‌లైన్‌లో అమ్మడం మొదలుపెట్టాయి. కాబూల్ స్కై డైవింగ్ క్లబ్ పేరుతో వాటిని విక్రయానికి పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లంతా.. కంపెనీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఒకరి కన్నీళ్లతో వ్యాపారం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని మండిపడుతున్నారు. ఒకరి బాధని ఇలా.. సంపాదించుకోవడం కోసం ఉపయోగించుకోవడానికి సిగ్గుచేటు అని కామెంట్లు చేస్తున్నారు.