కాజల్ సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కల్యాణం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తరువాత అందరి హీరోలతో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ చెరగని ముద్ర వేసుకుంది. టాప్ హీరోయిన్ గా మారింది. సినీ జీవితం మంచి ఫామ్ లో ఉండగానే తన చిన్ననాటి మిత్రుడైన గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది.
ఈ ఏడాది ఏప్రిల్ లో బాబుకు జన్మనిచ్చింది. కాజల్ గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమె ఎప్పటికప్పుడు తన చిత్రాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునేది. పిల్లాడు పుట్టి రెండు నెలలు కావొస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అతడి చిత్రాలను పంచుకోలేదు. బాబు పుట్టిన తరువాత ఫొటోలను పెట్టినప్పటికీ ముఖం పూర్తిగా ఎప్పుడూ చూపించలేదు.
తాజాగా ఓ చిత్రాన్ని అభిమానులతో పంచుకుంది కాజల్. అందులో పిల్లాడి ముఖం కొద్దిగా కనిపించేటట్లుగా చూపించింది. అంతేకాకుండా ‘‘నీల్ కిచ్లూ నా జీవితానికి దొరికిన ప్రేమ.. గుండె చప్పుడు’’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది.
అభిమానులు ఈ ఫోటో చూసి తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పటికైనా చోటా కిచ్లూను చూపింనందుకు థాంక్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాజల్ పంచుకున్న ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.