సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోలింగ్ కు గురవుతుంటారు హీరోయిన్లు. వాళ్లు వేసుకునే దుస్తులు కావొచ్చు, పెట్టే పోస్టుల వల్ల కావొచ్చు, ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటుంటారు. అయితే చాలామంది హీరోయిన్లు వీటిని చూసీచూడనట్టు వదిలేస్తారు. చాలా తక్కువమంది మాత్రమే సమాధానమిస్తారు. ట్రోలర్స్ కు దిమ్మతిరిగే కౌంటర్స్ వేస్తారు. ఇప్పుడీ లిస్ట్ లోకి తాజాగా కాజల్ కూడా చేరింది.
ప్రస్తుతం కాజల్ గర్భవతి. గర్భంతో ఉన్న హీరోయిన్లు ఫొటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో పెట్టడం చాలా కామన్. కాజల్ కూడా అదే పని చేసింది. దుబాయ్ లో దిగిన ఫొటోల్ని పోస్ట్ చేసింది. దీనిపై కొంతమంది వ్యతిరేకంగా స్పందించారు. గర్భంతో ఫొటోషూట్ ఏంటంటూ బాడీ షేమింగ్ చేశారు. మరికొంతమంది నెగెటివ్ మీమ్స్ తో విరుచుకుపడ్డారు.
వీటిని చూసీచూడనట్టు వదిలేయలేదు కాజల్. గర్భం దాల్చినప్పుడు శరీరంలో మార్పులు సహజమని చెప్పిన కాజల్.. ప్రస్తుతం అన్ని రకాలుగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నానని, ఇలాంటి టైమ్ లో నెగెటివ్ కామెంట్స్ పెట్టి తన ఆనందాన్ని దెబ్బతీయలేరంటూ కామెంట్ చేసింది. కొంతమంది మూర్ఖులు చేసే పనికి తన మూడ్ ను చెడగొట్టుకోనన్న కాజల్.. బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన మూర్ఖులంతా ఎదగాలని, కనీసం ఎదుటి వ్యక్తిని జీవించేలా వ్యవహరించాలని క్లాస్ పీకింది.
మొన్నటికి మొన్న హీరోయిన్ నేహా శెట్టి, సురేష్ కొండేటి అనే జర్నలిస్ట్ కు లెఫ్ట్ రైట్ క్లాస్ పీకి పడేసింది. మహిళలకు అతడిచ్చే గౌరవం ఏంటో, ఆయన ప్రశ్నతోనే తెలిసిపోయిందంటూ పంచ్ వేసింది. అంతకంటే ముందు రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనపై ట్రోల్ చేసిన ఓ వ్యక్తిని చెడామడా వాయించేసింది. నాగచైతన్యతో విడిపోయిన సమయంలో సమంత కూడా ట్రోలింగ్ కు గట్టిగా బదులిచ్చింది. ఇప్పుడీ లిస్ట్ లోకి కాజల్ కూడా చేరింది.
ఒకప్పట్లా హీరోయిన్లు తమపై జరుగుతున్న ట్రోలింగ్ ను భరించడం లేదు. వెంటనే స్పందిస్తున్నారు, అక్కడికక్కడే క్లాస్ పీకుతున్నారు.