పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది కాజల్. ఎప్పుడైతే గర్భం దాల్చిందో ఆ వెంటనే అన్నీ పక్కనపెట్టేసింది. అప్పటికే అంగీకరించిన ది ఘోస్ట్ సినిమా నుంచి తప్పుకుంది. ఆచార్య మూవీని ఆఘమేఘాల మీద పూర్తి చేసింది. ఆ తర్వాత ఆ సినిమా నుంచి కాజల్ పోర్షన్ మొత్తం తీసేశారు. అది వేరే సంగతి.
అలా పూర్తిగా కెమెరాకు దూరమైన ఈ ముద్దుగుమ్మ.. మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మరోసారి సినిమాలపై దృష్టి పెట్టింది. బాబు పుట్టిన తర్వాత ముందుగా తన ఫిజిక్ పై ఫోకస్ చేసి… ప్రెగ్నెన్సీ వల్ల పెరిగిన బరువును తగ్గించుకుంది. ఆ వెంటనే శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ లోనే ఉంది.
ఇదిలా ఉండగా, ఇప్పుడు మరో ప్రాజెక్టుపై సైన్ చేసింది కాజల్. లారెన్స్ దర్శకత్వంలో, అతడే హీరోగా చంద్రముఖి 2 సినిమా రాబోతోంది. ఇందులో కీలకమైన ఫిమేల్ ఓరియంటెండ్ పాత్రను కాజల్ పోషించబోతోంది. ఈ మేరకు లారెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుతం రుద్రుడు అనే సినిమా చేస్తున్నాడు లారెన్స్. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే చంద్రముఖి 2 స్టార్ట్ అవుతుంది. రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ ఇది. అయితే, ఇందులో రజనీకాంత్ నటించడం లేదు. ఆయన ఆశీస్సులతో లారెన్స్ చేయబోతున్నాడు.