– కాళేశ్వరం బాహుబలి మోటార్లు ఇప్పుడప్పుడే బాగు కావా?
– మళ్లీ వాటిని పునరుద్దరించాలంటే ఎంతకాలం పడుతుంది?
– పంప్ హౌస్ ల మునక.. ప్రభుత్వం, మేఘా తప్పిదమేనా?
– వరదలు మెగా దోపిడీని బయటపెట్టాయా?
– రివర్స్ పంపింగ్.. కేసీఆర్ కే రివర్స్ అయ్యిందా?
– మేఘా కాంట్రాక్టులపై సర్వత్రా చర్చ
– 8 ఏళ్లలో లక్షల కోట్ల కాంట్రాక్టులు..
– వాటిలో లోపాలెన్ని? జరిగిన అవినీతి ఎంత..?
పేనుకు పెత్తనం ఇస్తే తల అంతా కొరికి పెట్టిందట.. ప్రస్తుతం తెలంగాణలో ప్రాజెక్టులు, కాంట్రాక్టుల విషయంలో జరుగుతోంది ఇదేననే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ పాలనలో ఏ కాంట్రాక్ట్ అయినా మేఘా సంస్థకే దక్కుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మన ఊరు-బడి దాకా ఇప్పటిదాకా లక్షల కోట్ల కాంట్రాక్టులు ఆ సంస్థ దక్కించుకుంది. అసలు.. కేసీఆర్ పుణ్యమా? అనే మేఘా కృష్ణారెడ్డి వేల కోట్లకు అధిపతి అయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టులను అడ్డుపెట్టుకుని మ్యూచువల్ అండర్ స్టాండింగ్ లో భాగంగా ప్రజా ధనం దోపిడీ జరుగుతోందని ప్రతిపక్షాలు తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.
వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దెబ్బకు కాళేశ్వరం బాహుబలి మోటార్లు బురదలో కూరుకుపోయాయి. ప్రస్తుతం 29 మోటార్లు వరదలో మునిగి ఉన్నాయి. గోదావరి ఉధృతి తగ్గిన తర్వాత రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. వరద కారణంగా మోటార్లలో చేరిన బురద, ఇసుకను తొలగించడం మామూలు విషయం కాదు. ఎంతో వ్యయప్రయాసలు తప్పవు. వారంటీ ఉందని చెబుతున్నా.. ప్రకృతి విపత్తులకు అది పనిచేయదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. పంప్ హౌజ్ ల్లోకి నీళ్లు రావటంతో నష్టం భారీ స్థాయిలో జరిగిందని నిపుణులు అంటున్నారు. అది దాదాపు రూ.1500 కోట్ల మేర ఉండొచ్చని చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టు మునగడం వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంట్రాక్టర్ల అవినీతి ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కేసీఆరే ఓ ఇంజనీర్ గా దగ్గరుండి పనులు డిజైన్ చేశారని.. ఆయన అనాలోచిత విధానాలు, అర్థపర్థం లేని డిజైన్లే ప్రస్తుత స్థితి కారణంగా చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ వంటి లక్ష్మి పంపుహౌజ్ నుంచే నీటిని ఎత్తిపోస్తారు.. దాంతో, భారీ వరదలు వస్తే తట్టుకునేలా రూపకల్పన ఎందుకు చేయలేదనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. 1986 ఆగస్టు 16న కాళేశ్వరం దగ్గర అతి భారీగా 28.18 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లుగా రికార్డులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పంపుహౌజ్ నిర్మాణాన్ని చేయలేదు. ఇది ఇంజనీరింగ్ వైఫల్యమే. రక్షణ గోడ కూలిపోవడం నాణ్యతా లోపాలను ఎత్తిచూపిస్తోందని, భారీ ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు చర్చ ఏంటంటే.. నష్టం జరిగిన సొమ్ము, బాగు కోసం ఖర్చు పెట్టేది మళ్లీ ప్రజలదే. కేసీఆర్ సర్కార్, మేఘా సంస్థకు ప్రజాధనం వృధా, దోపిడీయే తెలుసని మండిపడుతున్నారు విపక్ష నేతలు. ఈ సందర్భంగా ఇతర కాంట్రాక్టుల విషయంలోనూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్యే మన ఊరు-మన బడి టెండర్ల విషయంలో వేసిన మెగా దోపిడీ ప్లాన్ బట్టబయలు అయింది. దీంతో టెండర్లు రద్దు చేసుకుంది ప్రభుత్వం. కనీస అనుభవం లేకుండా కాంట్రాక్టులు దక్కించుకున్నాయి కంపెనీలు. దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా మేఘా కృష్ణారెడ్డేనని తొలివెలుగు క్రైంబ్యూరో ఆధారాలతో సహా బయటపెట్టింది. తక్కువ ఖర్చు అయ్యే వాటికి కూడా అధికంగా చూపించి డబ్బులు దోచుకునేందుకు మన ఊరు-మన బడిని అడ్డుకుపెట్టుకుని పెద్ద స్కెచ్ గీశారు. ఇలా ఒకటేంటి? ఈ 8 ఏళ్ల కాలంలో మేఘా సంస్థ చేసిన ప్రతీ కాంట్రాక్ట్ లోనూ దోపిడీ జరిగిందని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. కాళేశ్వరం పంప్ హౌస్ లు మునిగిపోవడం.. ప్రభుత్వం, మేఘా సంస్థ నిర్లక్ష్యం.. అవినీతే కారణమని చెబుతున్నారు.