రివర్స్ గేర్..! ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ‘రివర్స్’ అనే పదం పాపులారిటీలోకి వచ్చింది. ఒకప్పుడు నీవెంటిరా అన్ని రివర్సుగా ఆలోచిస్తావ్.. అనేవాళ్ళు. కానీ ఇప్పుడు రివర్సుగా ఆలోచించడమే కరెక్టు అంటున్నారు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ అండ్ జగన్. ఎందుకంటే రివర్స్‌గా ఆలోచిస్తేనే మనకు లాభం అంటున్నారు. ఇప్పడు రెండు రాష్ట్రాలలో రివర్స్ పంపింగ్, రీడిజైన్, రివర్స్ టెండరింగ్ ఇలా అన్ని రివర్స్‌గానే నడుస్తున్నాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో రివర్స్ పదం హాట్ టాపిక్‌గా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు జగన్ కేసీఆర్ ఇలా రివర్స్‌గా ఆలోచిస్తున్నారు.? దీనితో వారికి కలిగే ప్రయోజనం ఏమిటి? రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటి? అన్నదే చర్చ.
తెలంగాణ వచ్చాక కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నాక ప్రాజెక్టుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పటికే డిజైన్ చేసిన సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తేల్చాడు. వీటిని రీ డిజైన్ చేయాలని చెప్పాడు. అందుకు కార్యాచరణ సిద్ధం చేశాడు. ఎన్ని విమర్శలు, ఎన్ని ఆరోపణలు వచ్చినా మొత్తానికి తాను అనుకున్నది చేశాడు. ప్రాజెక్ట్ అంచనాలను పెంచాడు. తాను అనుకున్న వాళ్లకే కాంట్రాక్టు అప్పగించాడు. కాళేశ్వరంతో రాష్ట్రం సస్యశామలం అవుతుందని అందరిని నమ్మించాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చూడటానికి రాష్ట్ర నలుములల నుంచి ప్రజలు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆది ఒక టూరిస్ట్ ప్లేస్ అయ్యింది. దీనితో ఒకవైపు ప్రజలను నమ్మించగలిగాడు. మరోవైపు పార్టీని నడపడానికి, ఎన్నికలను ఎదుర్కోవడానికి కావాల్సిన నిధులు సమకూర్చుకోగలిగాడు అంటున్నారు విశ్లేషకులు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం కార్యక్రమం చేపట్టినప్పుడు టీఆరెస్‌తో సహా నాడు అన్నిపార్టీలూ అది జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం అంటూ ఆరోపణలు చేశాయి. అంతేకాదు అందరూ కలసి పోరుబాట కూడా పట్టారని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఒక పుస్తకాన్నే ఆనాడు ముద్రించి పంచారని ప్రస్తావిస్తున్నారు. వైఎస్ చూపిన మార్గం నాడు తప్పుపట్టినా అదే కరెక్ట్ అన్నుకున్నట్లుంది కాబోలు అందుకే కేసీఆర్ పేరుమార్చి రీ డిజైన్‌తో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాడని అనలిస్టులు చెబుతున్నారు. వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా అటు ప్రజలను నమ్మించవొచ్చు.. ఇటు డబ్బులకు డబ్బులు వస్తాయి.. అని కేసీఆర్ గ్రహించాడని అంటున్నారు. ఆ మేరకు ఆర్ధికంగా తన పార్టీని నిలబెట్టగలిగాడని, అలాగే 2018 ఎన్నికలను ఫేస్ చేయడానికి, అంతకుముందు జరిగిన హైదరాబాద్ జీహెచ్ఏంసి వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ఇలా అనేక ఎన్నికలను ఫేస్ చేయడానికి కావాల్సిన ఆర్ధిక వనరులు సమకూరాయని, లేకుంటే టీఆరెస్‌కి కష్టం అయ్యేదని రాజకీయ వర్గాల అభిప్రాయం. కొందరు విశ్లేషకులు ఒకడుగు ముందుకేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి కూడా ఈ సమకూర్చుకున్న ఆర్ధిక వనరులు ఉపయోగపడ్డయని అనకపోలేదు. అంతటితో వారు ఆగలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో పొరుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా కేసీఆర్ ఈ వనరుల నుంచే ఫండింగ్ చేశాడన్నది వారి అభిప్రాయం.
ఇదే దారిలో నడవమని జగన్‌కు కూడా కేసీఆర్ హితబోధ చేసి ఉంటాడని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. అందుకే జగన్ కూడా రివర్స్ టెండరింగ్, రివర్స్ ఎస్టిమేషన్, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం లాంటి కార్యక్రమం చేపట్టి ఉంటాడని అనుమానం వ్యక్తంచేతున్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలాగో ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్ట్ అలా అని, అందుకే ఆదాయం వచ్చే పోలవరానికి రీటెండరింగ్ పెట్టివుంటారని అంటున్నారు. రీటెండరింగ్‌తో రాష్ట్ర ఖజానాకి ఆదాయం వచ్చేసంగతి ఎలా ఉన్నా మెఘాకు పోలవరం టెండర్ ఇవ్వడం వలన మాత్రం జగన్‌కి మాత్రం లాభం జరుగుతుందని అంటున్నారు. రాజధానిని కూడా రీడిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేస్తున్నారని, అందులో భాగంగానే అమరావతి నుంచి రాజధానిని మారుస్తున్నట్లు లీకులు ఇస్తున్నారని చెప్పుకొస్తున్నారు.