‘కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ సంజీవని. ఒక్కసారి ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణ ఆకుపచ్చని దుప్పటి కప్పుకున్నట్లు కనపడుతుంది. నెత్తి మీద కుండ పెట్టినట్లే. ఇక నీళ్లకు ఢోకా ఉండదు. ఏ డ్యామ్‌కు పోయినా, ఏ చెరువు చూసినా నిండు కుండ లెక్క! కళకళలాడుతూ, పర్యాటకులను పలకరిస్తాయి. భీడు భూములను సూద్దాం అంటే కనపడవు…’ ఈ మాటలు గుర్తుండే ఉంటాయ్.
అవన్నీ నీటి మూటలే అని ఎవరైనా అంటే విరుచుకుపడే వారు. రీ-డిజైన్ అనేదే తప్పు అంటే ఇక తెలంగాణ ద్రోహి అనే ముద్ర పడేది. తెలంగాణకు కాళేశ్వరం కరెంటు బిల్లులు శాపం అంటే ఇంకెన్ని కోట్లు అయినా కడతాం అంటూ సమాధానం.
కానీ ఇప్పుడు ప్రకృతి మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు భారమే అని నొక్కి చెప్పింది. ఎంత పెద్ద ప్రాజెక్టు కడితే ఏంలాభం వర్షాలు పడకుంటే..? కానీ వర్షాలు లేని సమయంలో కాళేశ్వరం కన్నా మించింది లేదని నీళ్ల లెక్కలు చెప్పి, వేల కోట్ల రూపాయాల ప్రజాధనం నీటిపాలు చేశారు కేసీఆర్.
ఈసారి పుష్కలంగా వానలు కురుస్తున్నాయి. దాంతో గోదావరి తన సహజ సిద్ధంగానే ప్రాజెక్టులను నింపుకుంటూ పరుగులు పెడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాని కన్నా ముందు నుండే ఉన్న అప్పర్ గోదావరి నుంచే ఈసారి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండింది. దాంతో మొన్నటి వరకు కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన సుందిళ్ల, అన్నారం బ్యారేజీలలోని నీరు, మేడిగడ్డ వద్ద ఎంతో ప్రజాధనం వెచ్చించి దాచుకున్న నీరు సముద్రం పాలు చేయక తప్పని పరిస్థితి.
ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటిమట్టం 20.18 టీఎంసీలు అయితే 19.81టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో 15వేల క్యూసెక్కులకు పైగా వస్తొన్న నీరును వచ్చింది, వచ్చినట్లు దిగువకు పంపిస్తున్నారు అధికారులు. ఎల్లంపల్లి నుంచి నీరు మేడిగడ్డ వైపే వెళ్లాల్సి రావటంతో నీరంతా సముద్రం పాలవుతోంది. ఇటు ప్రాణహిత నది భారీగా ప్రవహిస్తుండటం పైనున్న ఎల్లంపల్లి నుంచి కూడా వరద రావటంతో మేడిగడ్డ వద్ద 1.5 లక్షల ప్రవాహాంతో కిందకు నీరు వదులుతున్నారు. ఇటు లోయర్ మానేర్ డ్యాం కూడా పూర్తిగా నిండు కుండలా ఉంది.
బాహుబలి మోటార్లు వేల కోట్లు వెచ్చించి పవర్ స్టేషన్లు, ఎంతో మంది రైతన్నల దగ్గర నుంచి బలవంతపు భూసేకరణ కలిపి 80వేల కోట్లకు పైగా ప్రాజెక్టును రీడిజైన్ చేసి ఏంలాభమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎంత మొత్తుకున్నా వినకుండా కేసీఆర్ ఓంటెత్తు పోకడలకు పోయారని, ఇప్పుడు ప్రాజెక్ట్ వ్యయంతో పాటు, ఇన్నాళ్లు మోటార్లకు వినియోగించిన విద్యుత్ అంతా గంగపాలు అయిపోయిందని విమర్శిస్తున్నారు. కేసీఆర్ రీడిజైన్‌కు వెళ్లకుండా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలో పెట్టిన ఖర్చంతా ఎల్లంపల్లి దిగువ నుంచి కిందకు పెట్టినా, తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజి నిర్మాణాలు చేసినా 40 నుండి 50వేల కోట్లతో పోయేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా తప్పును తప్పు అని ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయటం కేసీఆర్‌కే చెల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు ఒక సంవత్సరం కాకపోతే మరో యేడాది పడుతాయి. కానీ నీటి లెక్కలు చూపుతూ రాష్ట్ర ఖజానాను నీళ్ల పాలు చేసి, అప్పుల తెలంగాణ మార్చి, రాబోయే రోజుల్లో తెలంగాణకు గుదిబండగా మార్చారన్న విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి.