తమిళనాడు కళ్లకురిచిలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో 12వ తరగతి విద్యార్థిని మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అధికారులు అప్పగించారు. బాలిక మృతదేహానికి పోస్టు మార్టమ్ అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్ లో ఆమె స్వగ్రామానికి తరలించారు.
బాలిక (17) కళ్లకుర్చి జిల్లా కనియమూర్ లో ఓ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. ఈ నెల 13న అనుమానాస్పద స్థితిలో మరణించింది. హాస్టల్ మూడవ అంతస్తు నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు పాఠశాల బస్సులను తగుపెట్టారు.
విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై కూడా వారు దాడికి దిగారు. ఉపాధ్యాయుల వేధింపులు అధికం కావడంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ ఘటనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆందోళన సమయంలో నిరసనకారులు పాఠశాలలోని బెంచీలు, కుర్చీలు ఎత్తుకు వెళ్లారు. దీంతో పాఠశాల సామగ్రిని తిరిగి ఇచ్చివేయాలని లేదంటే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఆ వస్తువులను తిరిగి పాఠశాల వద్ద ఆందోళనకారులు వదిలి వెళ్లారు.