(కాలువ శ్రీనివాసులు, మాజీ మంత్రి)
మళ్లీ పాడుకాలం దాపురించింది. పాతరోజులు పునరావృతం అవుతున్నాయ్. వైసీపీ వందరోజుల పాలనలో వందకు పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మా అనంతపురంలో జిల్లాలోనే 21 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
నిజానికి ఇవి రైతు ఆత్మహత్యలు కావు.. ప్రభుత్వ హత్యలు. అప్పట్లో ఇలానే విత్తనాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడేవారు. పోలీసులు లాఠీలు లేపారు. ఏరోజులైతే రాష్ట్రానికి తిరిగి రాకూడదని భయపడ్డాయో ఆ చీకటి రోజులు మళ్లీ వచ్చాయ్. హిస్టరీ రిపీట్స్.
జగన్ ఎన్నికల ముందు ఎన్ని చెప్పాడు..? ఇప్పుడేం చేస్తున్నాడు? విత్తనాల కోసం తోపులాటలో రైతు చనిపోతే కనీసం వెళ్లి చూసొచ్చాడా? ఓదార్పు యాత్ర ఇప్పుడు అవసరం లేదా? అనంతపురం జిల్లా ఉరవకొండ మార్కెట్ యార్డులో ఏం జరిగిందో మీకు తెలియలేదా.? లేక పట్టించుకోలేదా? విత్తనాల కోసం క్యూలైన్‌లో నిలబడి తోపులాటలో రైతు సిద్దప్ప మృతి చెందాడన్న సమాచారమే మీ వరకు రాలేదంటే నమ్మాలా? ఒక్క అనంతపురం జిల్లాలోనే రెండు మాసాల వ్యవధిలో ఇది రెండవ ప్రభుత్వ హత్య..! రెండు నెలల క్రితం రాయదుర్గం మార్కెట్ యార్డులో విత్తనాల కోసం క్యూలైన్‌లో నిలబడి రైతు ఈశ్వరప్ప మృతి చెందాడు.
అయ్యా.. జగన్ గారూ! చనిపోయిన రైతు కుటుంబాలకు మీ ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేస్తుందో కనీసం ఇప్పుడైనా నోరు తెరిచి చెప్పండి. రైతులకు విత్తన సరఫరా చేయడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. విత్తనాల పంపిణీలో మీ ప్రభుత్వానికి అసలు అవగాహనే లేదు. ఖరీఫ్‌లో, రబీలో విత్తనాల పంపిణీకి ప్రణాళిక లేకుండా చేశారు. ఏపిలో పంపిణీ చేయాల్సిన విత్తనాలు తెలంగాణలో చేశారని మీడియానే చెబుతోంది. పొరుగు రాష్ట్రంపై మీకున్న శ్రద్ధ అమోఘం. ఏపీకి దక్కాల్సిన నీళ్లు పక్క రాష్ట్రానికి ఇస్తామంటారు. సీజన్‌లో రైతులకు ఇన్‌పుట్స్ అందించడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందారని స్పష్టంగా అందరికీ అర్ధమైంది. అటు విత్తనాలు అందక, ఇటు పంట రుణాలు కూడా లేక రైతులు అష్టకష్టాలు పడ్డారు. ఇక, వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలు లేవు.