తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిపై దేశ వ్యాప్త జరుగుతోందని బీఆర్ఎస్ నేత, ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో ఎక్కువగా చర్చ నడుస్తోందన్నారు. మహారాష్ట్ర అభివృద్ధిలో తమ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని పేర్కొన్నారు.
మహారాష్ట్ర ప్రజల కోసం తాము పని చేస్తామని ఆమె ప్రకటించారు. మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి ముంబైలో ఆమె నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… తెలంగాణతో 1000 కిలోమీటర్ల మేర మహారాష్ట్ర సరిహద్దును పంచుకుంటుందని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఆమె వెల్లడించారు. మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ ను విస్తరించి, తెలంగాణ పథకాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ మేరకు అక్కడి ప్రజల నుంచి తమకు విజ్ఞప్తులు అందుతున్నాయన్నారు. దేశంలో ఇప్పటివరకు విద్యుత్తు, తాగునీరు, సాగునీరు అందించడం వంటి కనీస సదుపాయాలను ఎవరు కల్పించలేదన్నారు. తెలంగాణలో మాత్రం 98 శాతం సదుపాయాల కల్పనను పూర్తి చేశామన్నారు.
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రమే ఇంత అభివృద్దిని సాధించినప్పుడు దేశవ్యాప్తంగా ఎందుకు చేయలేరని ఆమె ప్రశ్నించారు. ఈ ఎజెండానే ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని ఆమె చెప్పారు. మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీ విషయంపై పార్టీ ప్రకటన చేస్తుందని ఆమె చెప్పారు.
ముంబైలో రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే మంచినీరు సరఫరా అవుతోందన్నారు. హైదరాబాద్‌లో మాత్రం 24 గంటల పాటు నల్ల ద్వారా ఇంటింటికి మంచినీరు అందుతోందన్నారు. తెలంగాణ సర్కార్ ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు మహారాష్ట్రలో ఎందుకు చేయలేరని ఆమె నిలదీశారు.