ధియెటర్ ఆర్ట్స్ అంటే మన ఎమ్మెల్యేల దగ్గరే నేర్చుకోవాలి. అపరిమితమైన వేగంతో కారులో వెళ్తూ గుద్దేసి ఒకరి ప్రాణాలు తీయడమే కాకుండా ప్రమాద స్థలం నుంచి పారిపోయి నేరుగా ఆసుపత్రిలో జాయినై ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడంటే ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎంత జాదూ అయ్యుండాలి… అని జనం తిట్టిపోస్తున్నారు. ఇంతకీ జైపాల్ యాదవ్ ఏంచేశాడంటే…
హైదరాబాద్: కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం హైదరాబాదు- శ్రీశైలం రహదారిపై మహేశ్వరం మండలం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగన్నాథం తుమ్మలూరు భాష్యం స్కూల్‌లో మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకొని స్కూల్ ఆవరణ నుంచి బయటకు వచ్చి రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. ఇంతలో జగన్నాథాన్ని కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కారును రోడ్డుమీదే వదిలి కారు డ్రైవర్‌తో పాటు పరారయ్యాడని స్థానికుల కధనం. సాయం అందించాల్సిన గౌరవ స్థానంలో వున్న ఎమ్మెల్యేనే సంఘటనా స్థలం నుంచి పరారు కావడం జిల్గాలో సంచలనం కలిగించింది. మృతుడి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించడంతో శ్రీశైలం-హైదరాబాదు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో సుమారు రెండు కిలోమీటర్ల దూరం వాహనాలు ఎక్కడికక్కడే నిలిపోయాయి. దీంతో మహేశ్వరం పోలీసులు రంగంలోకి దిగి ధర్నాకు దిగిన వారిని పక్కకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు, ఆయన డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోయినా ప్రమాదస్థలం నుంచి పారిపోయి తనకు కారు ప్రమాదంలో గాయాలయ్యాయని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరారని చెబుతున్నారు. పూర్తి వివరాలను సేకరించిన తరువాత సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహేశ్వరం సీఐ వెంకన్న నాయక్ చెప్పారు.