ప్రస్తుతం నందమూరి సినీ వారసుల గురించి చెప్పుకోవాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు కల్యాణ్ రామ్, ఎన్టీఆర్. వీరిద్దరికి మీడియా ఎదురుపడినప్పుడల్లా ముందుగా అడిగే ప్రశ్న ఒకటే… ఎప్పుడు రాజకీయ ప్రవేశం అంటూ…ప్రస్తుతం మా దృష్టంతా సినిమాల మీదే ఉందని ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా…. క్రియాశీల రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగుపెడతారు? అనే ప్రశ్న మాత్రం ఇద్దరికీ తరచూ ఎదురవుతూనే ఉంటుంది.
ఇప్పుడు బింబిసార ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కల్యాణ్ రామ్‌కి మరోసారి రాజకీయ ప్రశ్న ఎదురైంది. అయితే ఈసారి ఆయన కాస్త భిన్నంగా సమాధానం చెప్పాడు.
మనం ఒకేసారి రెండు పడవలలో ప్రయాణం చేయలేం. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాల మీదే ఉంది. ఒకవేళ నేను రాజకీయాల్లో అడుగుపెడితే,అప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తా అని కల్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.
కల్యాణ్ రామ్ ఇప్పుడిప్పుడే ట్రాక్ లోకి వస్తున్నాడు. హీరోగా నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ లెక్కన ఈయన పాలిటిక్స్‌లో అడుగుపెట్టాడానికి చాలా సమయమే పడుతుందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.
కాగా… పటాస్ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ అందుకోని కల్యాణ్ రామ్ బింబిసార మీదే చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తనని ట్రాక్‌లోకి తీసుకొస్తుందని చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇందులో బింబిసార రాజుగా కల్యాణ్ రామ్ నటిస్తున్నారు.