డైరెక్టర్ వెట్రిమారన్‌కు విశ్వనాయకుడు కమల్ హాసన్ బాసటగా నిలిచారు. రాజ రాజ చోళుడు ‘హిందూ రాజు కాదు’ అని డైరెక్టర్ వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. అసలు రాజ రాజ చోళుడి కాలంలో ‘హిందూ మతం’ లేనేలేదని ఆయన స్పష్టం చేశారు.
రాజరాజ చోళుడి కాలంలో వైనం, శైవం, సమనం మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత భారత్ లో అడుగుపెట్టిన బ్రిటీష్ వారు ఆ మూడింటిని సమిష్టిగా ఎలా పిలవాలో తెలియక హిందువులుగా సంబోధించారని తెలిపారు. తూత్తుకుడిని టుటికోరిన్‌గా మార్చినట్టుగానే ఆ మూడు వర్గాల్ని ‘హిందూ’గా మార్చారని వివరించారు.
కళ’కు భాష, కులం, మతం బేధాలు ఉండవన్నారు. వాటి ప్రాతిపదికన సినీ పరిశ్రమలో రాజకీయాలు మంచివి కాదన్నారు. తెలుగుతో పాటు పలు భాషల్లో ‘పొన్నియిన్ సెల్వన్’చిత్రాన్ని ఆదరించడం లేదని కొందరు వివాదం సృష్టిస్తున్నారని, అది సరికాదని సూచించారు.
గతంలో ‘శంకరాభరణం’ తెలుగు సినిమాను తమిళులు ఆదరించారని, ఇటు ‘మరో చరిత్ర’ అనే తమిళ చిత్రాన్ని తెలుగు వారు కూడా ఆదరించారని ఆయన గుర్తు చేశారు. అసలు సినిమా రంగంలో భాషా బేధాలు ఉండవన్నారు. మంచి సినిమా ఏ భాషలో వచ్చినా ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారని చెప్పారు.