మక్కళ్ నీది మయ్యమ్ నేత, సినీ నటుడు కమల్ హాసన్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నట్టే కనిపిస్తోంది. ఢిల్లీలో ఇటీవల ఆ పార్టీ నేత రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో పాదయాత్రలో ఆయనతో కలిసి నడిచినప్పుడే ఇక దోస్తీ ఖాయమైనట్టేనని అంతా భావించారు. తమిళనాడులో ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో కమల్.. కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో తాను చేరే సూచనలున్నాయని ఆయన చెప్పకనే చెప్పారు.
అంటే పాలక డీఎంకేని, కాంగ్రెస్ పార్టీని ఇటీవలివరకు విమర్శిస్తూ వచ్చిన మీరు..ఇక మీ వ్యూహం మార్చుకున్నట్టేనా అని ప్రశ్నించగా.. ప్రజా సేవకు ఐడియాలజీ అవరోధం కారాదని తెలివిగా సమాధానమిచ్చారు. రాహుల్ తలపెట్టిన యాత్ర రాజకీయాలకు అతీతమైనదని, దీన్ని సంకుచిత దృష్టితో చూడరాదని ఆయన ఆనాడే వ్యాఖ్యానించారు.మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడే వారితో చేతులు కలపడమన్నది ఓ ఉమ్మడి ధ్యేయమని, అందువల్లే ఈరోడ్ ఉపఎన్నిక జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నదని కమల్ హాసన్ పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి పేర్కొన్నారు. తన పోరాటం ఇక్కడ.. ఈ చిన్న మైదానంలోనే ప్రారంభమవుతుందని, క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని ఈ ‘విక్రమ్’ చెప్పారు.
ఎన్నికల్లో మరో పార్టీ అభ్యర్థికి ఈయన మద్దతు తెలపడం ఇదే మొట్టమొదటిసారి. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ, 2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమల్ నేతృత్వం లోని ఎంఎన్ఎం ఒంటరిగానే పోటీ చేసింది. అవినీతి, కుటుంబ పాలనవంటివాటికి వ్యతిరేకంగా 2018 లో ఆయన ఈ పార్టీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమహన్ ఎవెరా మృతితో ఈరోడ్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన తండ్రి, ప్రముఖ కాంగ్రెస్ నేత ఈవీకేఎస్ ఇలంగోవన్ ఇక్కడ ఇప్పుడు పోటీ చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితమే ఆయన కమల్ మద్దతును కోరారు. ఇలంగోవన్ దివంగత పెరియార్ మనుమడు కూడా.. కమల్ మద్దతు ఈ ఎన్నికలో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ కి పెద్ద బలాన్ని ఇచ్చిందని భావిస్తున్నారు. ఈ ఎన్నిక అలా ఉండగా ప్రధాన విపక్షమైన ఏఐఏడీఎంకేలో.. పార్టీ నేత ఎడప్పాడి పళనిస్వామికి, బహిష్కృత నేత ఓ. పన్నీరుసెల్వం కి మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయి. ఈ ఎన్నికలో తాము తమతమ అభ్యర్థులను నిలబెడతామని ఈ వర్గాలు ప్రకటించాయి. ఏపీఎస్ వర్గం తమ అభ్యర్థిని పోటీ పెడతామని వెల్లడించగానే బీజేపీకి చుక్కెదురైంది.