అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రెండు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరుపున పోటీలో ఉన్న జో బిడెన్… వైస్ ప్రెసిడెంట్ గా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ ను ప్రకటించారు. కమలా హ్యారిస్ కాలిఫోర్నియా సెనేటర్ గా ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి భారత సంతతి మహిళ పోటీ పడటం ఇదే తొలిసారి. ఇప్పుడు కమలా హ్యారిస్ గెలుపొందితే 2024లో అధ్యక్ష స్థానానికి పోటీలో ఉండే అవకాశం ఉంటుంది.
కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ సొంత రాష్ట్రం తమిళనాడు. స్వతహాగా డాక్టర్ అయిన ఆమె కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అక్కడే జమైకాకు చెందిన హ్యారిస్ ను వివాహాం చేసుకున్న కమలా… తొలి ప్రయత్నంలోనే సెనేట్ కు ఎంపిక కాగా, ఇప్పుడు ఏకంగా ఉపాధ్యక్ష స్థానంకు పోటీపడుతున్నారు. తనను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఖరారు చేయడంపై కమలా హ్యారిస్ జో బిడెన్ కు ధన్యవాదాలు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓవైపు అమెరికన్లను కూడగడుతూనే… భారతీయులను తనవైపు తిప్పుకునేందుకు ప్రధాని మోడీతో కార్యక్రమాలు చేశాడు. ఇలాంటి సమయంలో ట్రంప్ కు చెక్ పెట్టేందుకే జో బిడెన్ భారత సంతతి వ్యక్తికి అందులోనూ మహిళకు ఉపాధ్యక్ష స్థానం కల్పించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.