కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ..రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి బంద్ కొనసాగుతుంది. కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళనలతో నిన్నంతా ఉద్రిక్తతలతో రణరంగంగా మారిన నేపథ్యంలో బంద్ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా..పట్టణంలో అడుగడుగునా పోలీసులు మోహరించారు.
ఆందోళనలకు అవకాశమివ్వకుండా.. పలు పార్టీలకు చెందిన నేతలను ముందుగానే గృహనిర్బంధం చేశారు పోలీసులు. అయితే మాస్టర్ ప్లాన్ కారణంగా కామారెడ్డి పురపాలక సంఘం పరిసర ప్రాంతాల్లోని 8 గ్రామాల్లో 2 వేల 170 ఎకరాల సాగు భూములను పారిశ్రామిక జోన్ లో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి.
మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ…రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా ఆందోళనలు చేస్తుండగా.. రెండ్రోజుల క్రితం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆందోళనలకు మరింత ఆజ్యం పోసినట్లైంది.మాస్టర్ ప్లాన్ కారణంగానే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని..ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ.. నిన్న 8 గ్రామాలకు చెందిన రైతులు కుటుంబసభ్యులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా..కలెక్టరేట్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఇక కామారెడ్డి బంద్ తో పట్టణాలు వాహనాలు రోడ్డెక్కలేదు. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఉదయం పలువురు భాజపా నేతలు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా..పోలీసులు అడ్డుకొని, వారిని అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు రైతుల ఆందోళనలకు కాంగ్రెస్, భాజపా మద్దతు ప్రకటించాయి. మధ్యాహ్నం బండి సంజయ్ సహా కొందరు భాజపా నేతలు కామారెడ్డిలో పర్యటించి…చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.