– మాస్టర్ ప్లాన్ పై గళమెత్తిన రైతన్న
– కామారెడ్డి బంద్ లో ఉద్రిక్తత
– రైతులకు బీజేపీ, కాంగ్రెస్ అండ
– కొనసాగిన అరెస్టుల పర్వం
– కేసీఆర్ స్పందించాలన్న రేవంత్
– రైతుల ఉసురు పోసుకోవద్దన్న షబ్బీర్
– కేసీఆర్ పతనం మొదలైందన్న లక్ష్మణ్
– తగ్గేదే లేదంటున్న ఫార్మర్స్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. రెండో రోజు బంద్ కు పిలుపునివ్వడంతో పట్టణమంతా దుకాణాలు బంద్ చేయించారు. కాని భూమిని కాపాడుకోవడానికి అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు మద్దతిచ్చిన కాంగ్రెస్, బీజేపీల నిరసన కార్యక్రమాలతో కామారెడ్డి అట్టుడికిపోయింది.
రైతులకు సంఘీభావం తెలపడానికి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డికి రావడంతో మరో సారి టెన్షన్.. టెన్షన్ మొదలైంది. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. దీంతో ఇందిరా చౌక్ వద్ద ఉద్రిక్తత వాతారణం నెలకొంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. షబ్బీర్ అలీ, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు ధర్నా ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దీంతో షబ్బీర్ అలీ,కిసాన్ కేత్ జాతీయ నేత కోదండ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి సహా 100 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
అయితే షబ్బీర్ అలీని తరిలించే వాహనానికి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి అడ్డుకున్నారు. అయినా కాని పోలీసు వాహనంలో షబ్బీర్ అలీని పోలీస్ స్టేషన్ కు తరలించారు.అయితే నిన్న జిల్లా కలెక్టర్ రైతు ఆందోళనను అవమానించారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండి పడ్డారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను సవరిస్తామని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తీరు దున్నపోతు పై వర్షం పడ్డట్లు ఉందని విమర్శించారు. మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. కామారెడ్డి రైతుల భూముల్లో ఇండస్ట్రియల్ ప్రతిపాదన రద్దు చేయాలని, మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటన చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. అయితే కామారెడ్డిలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది.
మరో వైపు బంద్ కు మద్దతుగా బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి రైతుల ఆందోళనతో కేసీఆర్ పతనం మొదలైందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఎవరో రైతు చనిపోయాడని మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని.. రైతంటే కేటీఆర్ కు అంత ఎగతాళిగా ఉందా అని ఆయన ప్రశ్నించారు. దొడ్డి దారిన కాకుండా గ్రామసభ నిర్వహించి మాస్టర్ ప్లాన్ పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే రైతులు మాస్టర్ ప్లాన్ ను ఇంతలా వ్యతిరేకించడానికి గల కారణాల విషయానికొస్తే.. కామారెడ్డిలోని 8 గ్రామాల్లో ఉండే 61.5 చదరపు కిలోమీటర్ల పరిధికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెన్సీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. డ్రాఫ్ట్ రిలీజ్ చేసిన అధికారులు 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ ప్లాన్ ప్రకారం 1200 ఎకరాలను ఇండస్ట్రీయల్ కింద ప్రతిపాదించారు. ఇందులో దాదాపు 900 ఎకరాలు నేషనల్ హైవే పక్కన టౌన్ కు దగ్గరగా ఉన్న భూములే. ఇందులో ఎక్కువ శాతం పచ్చని పంట పొలాలే ఉన్నాయి. దీంతో రైతులు వ్యతిరేకించి ఉద్యమానికి దిగారు. 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదన మీద రైతులు ఆభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను మార్చాలని పట్టుబడుతున్నారు.