కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో రైతన్నలు నిరసనబాట పట్టడంతో కలెక్టర్ జితేష్ వీ పాటిల్ మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుతం ఇచ్చింది డ్రాఫ్ట్ ప్లాన్ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అభ్యంతరాలు ఏమున్నాయో చెప్పాలని తెలిపారు. ఇప్పటివరకు 1026 అభ్యంతరాలు వచ్చాయన్న ఆయన.. జనవరి 11 వరకు అవకాశం ఉందన్నారు. భూములు పోతాయనే భయం రైతులకు వద్దన్న కలెక్టర్.. పంట పొలాల్లో ఇండస్ట్రియల్ జోన్ పెట్టడం లేదని స్పష్టం చేశారు.
రైతుల భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమేనన్న కలెక్టర్.. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. జోన్ ప్రకటించినంత మాత్రాన భూసేకరణ జరగదని చెప్పారు. ఇంకా అనేక ప్రక్రియలు ఉన్నాయని.. ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్నందువల్ల భూములు పోతాయని అన్నదాతలు భయపడొద్దని సూచించారు. 60 రోజుల్లో సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని ఫ్లెక్సీలు కూడా వేశామన్నారు.
ముసాయిదాలో మార్పులు, చేర్పులు జరుగుతాయన్న పాటిల్.. రైతులకు అనుమానాలుంటే కలెక్టర్ ఆఫీస్ లో నివృత్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయడం సరికాదని.. అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరుకూడా అపోహలకు పోవద్దని, ప్రతి ఒక్కరికి జవాబు తప్పనిసరిగా ఇస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ గ్రాఫ్ తో సహా.. ఆ ప్రతిపాదనలో స్పష్టంగా అంతా ఉందని కలెక్టర్ మీడియా ముందు చదివి వినిపించారు.
మాస్టర్ ప్లాన్ లో భూమి పోతుందనే భయంతో శ్రీరాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మిగిలిన రైతుల్లో ఆందోళన పెరిగింది. వారికి ప్రతిపక్షాలు తోడవడంతో వివాదం ముదిరింది. ధర్నాలు, బంద్, నిరసనలు, ముట్టడి కార్యక్రమాలతో మూడు రోజులుగా కామారెడ్డి యుద్ధ వాతావారణాన్ని తలపిస్తోంది. కలెక్టర్ పై మంత్రి కేటీఆర్ కూడా మండిపడినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన మీడియా ముందుకొచ్చి అందరికీ ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.