కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు తెలంగాణ రాష్ట్ర హెచ్ఆర్సీని ఆశ్రయించారు. తమకు అన్యాయం చేసిన కామారెడ్డి కలెక్టర్, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాస్టర్ ప్లాన్ వ్యతిరేక నిరసనల్లో లాఠీఛార్జ్ చేశారని ఫిర్యాదు చేశారు. రైతులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఈ ప్రభుత్వం లాఠీతో అణిచివేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
తమకు పోలీసుల వద్ద, కోర్టుల్లో న్యాయం జరగడం లేదని.. అందుకే హెచ్ఆర్సీని ఆశ్రయించినట్లు వెల్లడించారు. తమ బాధను కలెక్టర్ కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు.
కాగా మాస్టర్ ప్లాన్ వివాదంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఎవరికీ అన్యాయం జరగకుండా మాస్టర్ ప్లాన్ ను మారుస్తామని హామీ కూడా ఇచ్చారు. అయినా రైతులు నాయకులను నమ్మడం లేదు. ఇందులో భాగంగానే బాధిత రైతులంతా హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఈ నెల 11న బాధిత రైతుల పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏం కాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ల విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని.. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే భారత దేశం ఎప్పుడో బాగుపడేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణనను ఈ నెల 25కి వాయిదే వేసింది హైకోర్టు.